Rekha Guptha : జెయింట్ కిల్లర్ కు షాక్ ఇచ్చిన మహిళ హిస్టరీ తెలిస్తే?
అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్నికల్లో ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచిన పర్వేశ్ వర్మ ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారనుకున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ ను మొన్నటి ఎన్నికల్లో ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచిన పర్వేశ్ వర్మ ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారనుకున్నారు. కానీ అనూహ్యంగా పర్వేశ్ ను కాదని రేఖా గుప్తాను పార్టీ నాయకత్వం ఎంపిక చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని చెబుతున్నప్పటికీ అధినాయకత్వం సూచన మేరకే ఎమ్మెల్యేలు పర్వేశ్ వర్మను పక్కన పెట్టి రేఖాగుప్తాకు జైకొట్టారు. రేఖా గుప్తా హిస్టరీ చూసినా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఆమె తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచార. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలిచిన రేఖా గుప్తా నక్క తోకను తొక్కినట్లయింది. ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్న పర్వేశ్ వర్మకు చివరకు నిరాశే మిగిలింది. నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి...
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం కొత్తేమీకాదు. గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ ల్లోనూ బీజేపీ ఇదే వైఖరిని అనురించింది. అదే పంథాను ఢిల్లీలోనూ చూపించింది. దీంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ మహిళ ముఖ్యమంత్రులు ఎవరూ లేరు. రేఖాగుప్తా నియామకంతో ఆ లోటు కూడా తీరినట్లయింది. అరవింద్ కేజ్రీవాల్ సామాజికవర్గానికి చెందిన రేఖాగుప్తా బ్యాక్ గ్రౌండ్ చూస్తే తక్కువగా కనిపిస్తున్నా ఆమె అట్టడుగు నుంచి క్రమంగా ఎదుగుతూ వచ్చారు. రేఖాగుప్తా కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ గా, తర్వాత నేరుగా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం అంటే ఆషామాషీ కాదు. రేఖాగుప్తా విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చుర్గుా వ్యవహరించే వారు.
కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ గా...
2015, 2020 ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయినా మూడోసారి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికలలోగెలిచి కార్యదర్శిగా పనిచేశారు. చదువుకునే రోజుల నుంచి చురుగ్గా ఉండే రేఖాగుప్తా కౌన్సిలర్లుగా రెండుసార్లు, ఒకసారి కార్పొరేటర్ గా గెలిచారు. రేఖా గుప్తా నియామకానికి నరేంద్ర మోదీ, అమిత్ షాలు ముందుగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకూ ఆగడానికి కారణం పార్టీ నేతలకు కొంత గ్యాప్ ఇవ్వడం కోసమేనని అంటున్నారు. మొత్తం మీద జెయింట్ కిల్లర్ పర్వేశ్ వర్మ ను కాదని రేఖాగుప్తాను నియమించి బీజేపీ నాయకత్వం ఢిల్లీ బీజేపీ రాజకీయాల్లో మలుపు తిప్పినట్లయిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.