జమ్మూకాశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్ లో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. రాష్ట్రంలోని కీశ్త్ వాడ్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీగా ప్రాణ నష్టం జరిగింది. ప్రస్తుతం మృతుల సంఖ్య 60 కి చేరింది. మరింత పెరిగే అవకాశముంది. ఈ ఆకస్మిక వరదలతో వందల సంఖ్యలో గాయపడినట్లు ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇంకా దాదాపు 69 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని తెలిపింది. వరదల్లో గల్లంతయిన వారి కోసం ఇంకా సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి.
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్...
జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తో పాటు స్థానిక యువకులు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అనేక స్వచ్ఛంద సేవాసంస్థలు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నాయి. భారత సైన్యం కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటుంది. అయినా సరే ఆకస్మిక వరదల్లో గల్లంతయిన వారి ఆచూకీ మాత్రం లభించడం లేదు. సహాయక చర్యలకు ప్రతికూల వాతావరణం కూడా తోడయింది. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలను ప్రభుత్వం భారీ వర్షాల కారణంగా నిలిపి వేశారు.
మృతదేహాలను గుర్తించేందుకు...
శిధిలాల కింద లభించిన మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు సోషల్ మీడియా ద్వారా వారి కుటుంబ సభ్యులకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. లభ్యమయిన మృతదేహాల్లో కేవలం ముప్ఫయి మందిని మాత్రమే ఇప్పటి వరకూ అధికార వర్గాలు గుర్తించగలిగాయి. మిగిలిన వారి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాయి. మరొకవైపు భారీ వరదల కారణంగా గాయపడిన వందల మంది ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. మచైల్ మాత ఆలయాన్ని దర్శించేందుకు వచ్చిన వీరు ఆకస్మిక వరదల్లో చిక్కుకుని అశువులు బాశారు. వైద్య బృందాలు అక్కడికక్కడే నిరంతరం సేవలందిస్తున్నా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని చెబుతున్నారు.