ఖర్గే గెలుపు ఖాయమా.. శశి థరూర్ అద్భుతం చేస్తారా.. ఇంకొద్ది గంటల్లో..!

Update: 2022-10-19 02:36 GMT

కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షుడు ఎవరో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. ఖర్గే గాంధీ కుటుంబం 'అనధికారిక అధికారిక అభ్యర్థి'గా పరిగణించబడుతుండడమే కాకుండా, పెద్ద సంఖ్యలో సీనియర్ నాయకులు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. శశి థరూర్ తనను తాను 'మార్పు' కు అభ్యర్థిగా చెబుతున్నారు. దాదాపు 137 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ అధ్యక్ష పదవిని ఎవరు చేపట్టాలనేది ఎన్నికల ద్వారా నిర్ణయించడం ఇది ఆరోసారి. 24 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి సోమవారం పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి.

ఓట్ల లెక్కింపునకు ఏఐసీసీ ఇప్పటికే ఏర్పాటు పూర్తిచేసింది. దేశవ్యాప్తంగా 65 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 9 వేల మందికి పైగా ప్రతినిధులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఖర్గేకి గాంధీ కుటుంబం పూర్తిస్థాయిలో మద్దతు ఉందని ఆయన గెలుపు ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తదుపరి నాయకత్వంపై కాంగ్రెస్ కార్యకర్తలు నిర్ణయం తీసుకుంటారని థరూర్ మీడియాతో అన్నారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. "భారత్ జోడో యాత్ర లాగా, ఈ అధ్యక్ష ఎన్నికలు కూడా పార్టీని బాగు చేయడానికి ఉద్దేశించబడ్డాయి. బీజేపీని ఎదుర్కోవడానికి.. అలాగే వచ్చే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవడానికి కొత్త శక్తి అవసరం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పెద్ద సవాల్‌ ఎదుర్కోబోతున్నాం. ఈ అధ్యక్ష ఎన్నికలు ఆ లక్ష్యాన్ని సాధించాయని నేను ఆశిస్తున్నాను, "అని ఆయన అన్నారు.


Tags:    

Similar News