ప్రకాష్ రాజ్ పై కేసు నమోదు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్

Update: 2023-08-22 09:11 GMT

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ పై ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పెట్టిన వివాదాస్పదం అయింది. ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై తీవ్ర విమర్శలు రాగా.. కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. చంద్రయాన్-3 పై ప్రకాష్ రాజ్ పోస్టు పెడుతూ.. ఒక వ్యక్తి చొక్కా లుంగీ ధరించి టీ పోస్తున్నట్లు ఉన్న ఒక కార్టూన్ ట్వీట్ చేశాడు. 'చంద్రుడి నుండి వస్తున్న మొదటి చిత్రం' అని ఎగతాళి చేశాడు. దీనిపై కర్ణాటక రాష్ట్రంలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. "చంద్రయాన్-3 మిషన్‌పై పోస్ట్ చేసినందుకు నటుడు ప్రకాష్ రాజ్‌పై ఫిర్యాదు నమోదైంది. హిందూ సంస్థల నాయకులు ప్రకాష్ రాజ్ పై బాగల్‌కోట్ జిల్లా బనహట్టి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు" అని ANI నివేదించింది.

ప్రకాష్ రాజ్ తాను చేసిన ట్వీట్ ను సమర్ధించుకున్నాడు. ద్వేషించే వారికి అంతా ద్వేషమే కనిపిస్తుంది.. అది ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్.. అది అర్ధం చేసుకోకుండా ఎవరికి వారు విమర్శిస్తే ఎట్లా? నేను కేరళ చాయ్‌వాలాని ఉద్దేశించి పోస్ట్ చేశాను.. మీరు ఏ చాయ్‌వాలా గురించి అనుకున్నారో..? అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ISRO ప్రకారం, చంద్రయాన్-3 ఆగస్టు 23న 18:04 గంటలకు చంద్రునిపై ల్యాండ్ కానుంది. దీంతో అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించనుంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ఏకైక దేశంగా భారతదేశం చరిత్ర లిఖించే అవకాశం ఉంది. సేఫ్ ల్యాండింగ్ అవ్వాలని భారత ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు.


Tags:    

Similar News