మరో భారం.. పెరగనున్న సిమెంట్ ధరలు

సామాన్యుడిపై మరో భారం పడనుంది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు తోడు.. ఇప్పుడు సిమెంట్ ధరలు కూడా పెరగనున్నాయి

Update: 2021-12-03 06:13 GMT

సామాన్యుడిపై మరో భారం పడనుంది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు తోడు.. ఇప్పుడు సిమెంట్ ధరలు కూడా పెరగనున్నాయి. ప్రస్తుతం 50 కిలోల సిమెంట్ బస్తా ధర రూ.380 నుంచి రూ.385 వరకూ ఉండగా.. వచ్చే రెండు, మూడు నెలల్లో ఈ ధరలు రూ.15 నుంచి రూ.20 మేర పెరగనున్నట్లుగా క్రిసిల్ అంచనా వేస్తోంది.

క్రిసిల్ అంచనాల ప్రకారం...
క్రిసిల్ అంచనా మేరకు సిమెంట్ ధరలు పెరిగితే.. గతంలో ఎన్నడూ లేని విధంగా 50 కిలోల సిమెంట్ బస్తా ధర రూ.400కు చేరనుంది. ముడి పదార్థాల ధరల పెరుగుదల వల్లే సిమెంట్ ధరలు పెరగనున్నట్లుగా సిమెంట్ అమ్మకాల కంపెనీలు పేర్కొన్నాయి. ఈ తయారీలో ప్రధాన ముడి పదార్థాలైన బొగ్గు, పెట్ కోక్ ల ధరలు ఇటీవలే భారీగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే బొగ్గు 120 శాతం, పెట్ కోక్ ధర 80 శాతం వరకూ పెరిగింది.
ధరలను పెంచడం తప్ప...
రవాణా ఛార్జీలు సైతం 5 నుంచి 10 శాతం వరకూ పెరగడంతో.. ధరలు పెంచడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని సిమెంటు కంపెనీలు చెబుతున్నాయి. ఉత్పత్తి ఖర్చుల పెరుగుదలతోనే సిమెంట్ ధరలు పెరుగుతున్నాయని, దీనివల్ల తమకు పెద్దగా లాభం ఉండదని కంపెనీల యాజమాన్యం పేర్కొంది.


Tags:    

Similar News