లోకో పైలట్‌ అలర్ట్‌.. తప్పిన భారీ రైలు ప్రమాదం

లోకో పైలట్‌ సకాలంలో స్పందించడంతో మరో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. మంగళవారం సాయంత్రం రైల్వే క్రాసింగ్‌ దగ్గర గేటు పడుతున్న

Update: 2023-06-07 03:59 GMT

లోకో పైలట్‌ సకాలంలో స్పందించడంతో మరో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. మంగళవారం సాయంత్రం రైల్వే క్రాసింగ్‌ దగ్గర గేటు పడుతున్న సమయంలో.. ఓ ట్రాక్టర్‌ ఆ గేటును ఢీకొట్టింది. ఆ తర్వాత ట్రాక్టర్ రైల్వే ట్రాక్, గేట్ మధ్య ఇరుక్కుపోయింది. దీన్ని దూరం నుంచే చూసిన లోకో పైలట్‌ అప్రమత్తమయ్యారు. వెంటనే రైలుకు బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలోని భోజుడిహ్ రైల్వే స్టేషన్ సమీపంలోని సంతాల్‌ధీ రైల్వే క్రాసింగ్‌ దగ్గర చోటుచేసుకుంది. రేల్వే గేటును ట్రాక్టర్ ఢీకొనడాన్ని దూరం నుంచే గమనించడంతో న్యూ ఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 22812) లోకో పైలట్ వెంటనే బ్రేకులు వేశారు.

దీంతో ప్రమాదం తప్పిందని సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని అద్రా డివిజన్ డీఆర్ఎమ్‌ మనీష్ కుమార్ తెలిపారు. ఈ సంఘటన సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు 45 నిమిషాలు పాటు అంతరాయం ఏర్పడింది. ట్రాక్టర్‌ను సీజ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, గేట్ మ్యాన్‌ను సస్పెండ్ చేసినట్లు రైల్వే అధికారి తెలిపారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం రైల్వే పోలీసులు గాలిస్తున్నారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్‌లో దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం జరిగిన కొద్ది రోజులకే ఈ సంఘటన జరిగింది.

Tags:    

Similar News