వీడియో సాంగ్ విడుదల చేసి అంచనాలు పెంచేశారు

Update: 2016-12-10 05:00 GMT

బాలీవుడ్ అగ్ర కథానాయకులలో ఒకరు అయినా హ్రితిక్ రోషన్ తన కెరీర్ పలు వైవిధ్యమైన పాత్రలు పోషించిన సంగతి విదితమే. అయితే వాటిల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆయన నిలబడలేని, కదలలేని పాత్రలో పూర్తిగా వీల్ చైర్కే పరిమితమైన వ్యక్తిగా నటించిన గుజారిష్ చిత్రం లోని పాత్ర. సంజయ్ లీల బన్సాలి తెరపై ఆవిష్కరించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ వాణిజ్య అంశాలకు అలవాటు పడిపోయిన భారత చిత్రాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆశించిన స్థాయిలో ఆదరించలేదు. తరువాతి కాలంలో హ్రితిక్ రోషన్ నటించిన జిందగీ నా మిలేగి దుబారా లాంటి ఒకటి అరా చిత్రాలు తప్ప చెప్పుకోదగ్గ విజయాలు ఏమి లేవు.

ఇటీవలి కాలం లో మొహెంజోదారో చిత్రం కూడా ఘోర వైఫల్యం చెందటంతో ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ప్రేక్షకులను పలకరించి హిట్ కొట్టాలని కసితో కాబిల్ చిత్రాన్ని జనవరి విడుదలకు సిద్ధం చేస్తున్నాడు హ్రితిక్. ఈ చిత్రంలో హ్రితిక్ రోషన్ సరసన యామి గౌతమ్ కథానాయికగా నటించింది. అయితే ఈ ఇరువురి పాత్రలు అంధుల పాత్రలే కావటంతో అంధుల మధ్య రొమాన్స్ ఏ మాత్రం ఆవిష్కరిస్తారు అని ఈ జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పై అంచనాలు ఒక్కసారిగా సప్పపడిపోయాయి. మరో వైపు అదే సమయానికి విడుదల తేదీ ప్రకటించిన షారుఖ్ ఖాన్ రాయిస్ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల దృష్టి ఆకర్షించటానికి కాబిల్ చిత్ర బృందం కాబిల్ హు అనే వీడియో సాంగ్ ని విడుదల చేసింది. ఈ పాటలో కనిపించే అద్భుతమైన విజువల్స్ కి నెటిజన్లు మంత్రముగ్ధులు అయిపోయారు. మొన్నటి వరకు రాయిస్ విడుదలకు హ్రితిక్ బయపడగా, ఇప్పుడు కాబిల్ చిత్ర విడుదలకి షారుఖ్ ఖాన్ భయపడే పరిస్థితి ఏర్పడింది ఈ ఒక్క వీడియో సాంగ్ తో.

హ్రితిక్ రోషన్ తో పాటు షారుఖ్ ఖాన్ కూడా హ్యాపీ న్యూ ఇయర్, దిల్వాలే, ఫ్యాన్, డియర్ జిందగీ ల వరుస వైఫల్యాలతో సతమతమయ్యి రాయిస్ తో పూర్వ వైభవం బాక్స్ ఆఫీస్ కు చూపించాలని తాపత్రయ పడుతున్నాడు. గణతంత్ర దినం సందర్భముగా విడుదల కానున్న ఈ చిత్రాలలో ప్రేక్షకులు ఏ చిత్రాన్ని విజయం చేస్తారో చూడాలి.

Similar News