తన సినీ కెరీర్ ఆరంభ దశలో మీడియా ప్రభావం చాలా తక్కువ ఉన్న రోజులలోనూ వార్తల్లో నానుతూనే ఉండేవాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన తెలుగు సినిమా ని మూస ధోరణి బాట నుంచి కొత్త శైలిలోకి తీసుకెళ్తూ, హీరోయిజం అనే పదానికి కొత్త అర్ధం చెప్పిన మొదటి చిత్ర శివ దగ్గర నుంచి తాజాగా వంగవీటి వరకు ఆయన నిత్యం వార్తల్లో ముఖ్యంగా వివాదాల్లో ఉంటూనే ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన ఎంచుకునే కథాంశం వివాదాస్పదం కాగా, మరి కొన్ని సార్లు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలూ ఆయన ట్విట్టర్ ద్వారా బహిర్గతం చేసి వివాదపు వ్యాఖ్యలలో భాగం అవుతుంటారు.
రామ్ గోపాల్ వర్మ వివాదం సృష్టించదలచుకుంటే ఆయనకు చిరంజీవి 150 వ చిత్రం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, కె.సి.ఆర్ అందం, వినాయకుడి ఆకారం, రాముడి అరణ్యవాసం ఇలా దేని గురించి ఐనా ఆయన వ్యక్తిగత అభిప్రాయలు వ్యక్త పరిచి, దానివల్ల ఎవరి మనోభావాలు ఐనా దెబ్బతిని ఉంటే తనకు సంబంధం లేదు అని నిక్కచ్చి గా చెప్పే వ్యక్తి, ఇప్పుడు జాతీయ సమస్యగా నిలిచిన సర్జికల్ స్ట్రైక్స్ విషయమై ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్పందిస్తూ దేశ ప్రజల తరపున మాట్లాడారు. తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కేజ్రీవాల్ తలకు మఫ్లర్తో కనిపిస్తే కోతిలా అనిపించేవాడు అని, ఇప్పుడు దేశం పట్ల ఆయన తీరును చూస్తుంటే నిజంగానే కేజ్రీవాల్ కోతే అని వ్యాఖ్యానించారు వర్మ. ఇలా మొదటి సారి ప్రజల మనోభావాలకు అతని అభిప్రాయాలకు సఖ్యత కుదరటంతో వర్మ మారిపోయాడు అని నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. కానీ మరో అంశం పై వర్మ స్పందిస్తే ఆయన నిలకడ ఏమిటో అర్ధం అయిపోతుంది.
రామ్ గోపాల్ వర్మ తాజా గా విడుదల చేసిన వంగవీటి చిత్ర ప్రచార చిత్రానికి అమితమైన స్పందన వస్తుంది. అతి త్వరలో ప్రేక్షకులకు వంగవీటి చూసే భాగ్యం కలిపించి తాను ముంబైలో మకాం పెడతానని అంటున్నాడు వర్మ.