ప్రస్తుత తెలుగు చిత్ర పరిశ్రమకి, తెలుగు సినిమా ప్రేక్షకులకి ఆశక్తి రేపుతున్న చిత్రాలు ఖైదీ నెం.150, గౌతమీ పుత్ర శాతకర్ణి. ఒకటి మెగా స్టార్ చిరంజీవి వెండి తెరపై పునర్దర్శనం ఇవ్వబోతున్న చిత్రం కాగా, మరొకటి యువరత్న నందమూరి బాలక్రిష్ణ నటిస్తున్న 100వ చిత్రం. ఈ రెండు చిత్రాలు ముహూర్తం జరుపుకున్న నాటి నుంచి విడుదల హక్కుల పై ఫాన్సీ రేట్లే వినపడుతున్నాయి. అందులోనూ రెండు చిత్రాలు 2017 సంక్రాంతి బరిలో ఉండటం విశేషం. రెండు పెద్ద చిత్రాలు ఒకే సారి విడుదలకు సన్నాహాలు జరుగుతుండటంతో పంపిణీదారులు ఇప్పటినుంచే విడుదల హక్కులకు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. ఇప్పుడే విడుదల హక్కులను ఖాయం చేసుకుని థియేటర్స్ బ్లాక్ చేసుకుంటే సంక్రాంతి పండుగ సమయంలో ఎక్సిభిటర్స్ తో ఇబ్బంది ఉండదు అని పంపిణీదారుల ఆలోచన.
తాజాగా అ ఆ చిత్రం తో ఘన విజయాన్ని నమోదు చేసిన యువ నటుడు నితిన్, గౌతమీ పుత్ర శాతకర్ణి నైజాం ప్రాంత విడుదల హక్కులను సొంతం చేసుకున్నారు. గత సంవత్సరంలో విడుదల ఐన అఖిల్ చిత్ర నిర్మాతగా, మరియు తమిళ నటుడు సూర్య నటించిన 24 చిత్ర విడుదల హక్కులను తీసుకుని ఘోర ఆర్ధిక నష్టాలు చూసిన సంగతి తెలిసిందే. నందమూరి బాలక్రిష్ణ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న గౌతమీ పుత్ర శాతకర్ణి తనని ఆర్ధికంగా మళ్ళీ లాభాల బాటలో నడిపిస్తుంది అని నమ్మి అధిక మొత్తానికి నైజాం హక్కులను సొంతం చేసుకున్నట్టు సమాచారం.
నిర్మాతగా, పంపిణీదారుడిగా 2015, 2016 సంవత్సరాలు నితిన్ కి కలిసిరానప్పటికీ నితిన్ నటించిన అఆ చిత్రం 47 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించి నిర్మాతకి లాభాలని అందించింది.