ఇప్పటి తరం కథానాయికలకు కాల పరిమితి చాలా తక్కువ అనే చెప్పాలి. సినిమాలలో పెరుగుతున్న వాణిజ్య అంశాలు, సమకాలీన నటీమణుల మధ్య నెలకొనే పోటీ, కొత్త ముఖాలను కోరుకునే ప్రేక్షక సంఖ్య పెరగటం ఇలా ఇతరితర కారణాల వల్ల చిత్ర పరిశ్రమ లో ఎందరో భామలు పది చిత్రాల సంఖ్య దాటకముందే మరుగునపడిపోతున్నారు. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా దశాబ్దం పైగా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్న కథానాయికలు లేక పోలేదు. ఆ ఘనత సాధించిన వారిలో శ్రీయ శరన్, అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్, త్రిష, ప్రియమణి వంటి వారు ఇప్పటికి తమ సత్తా చాటుతున్నారు.
తమిళ చిత్ర పరిశ్రమలో పరిచయమై, ఆరంభంలో ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొని తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రవేశించింది కర్ణాటక భామ ప్రియమణి. వాణిజ్య పరమైన సినిమాలతో పాటు కథా బలం ఉన్న చిత్రాలలో నటిస్తూ మంచి నటి గా గుర్తింపు తెచ్చుకుని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ చిత్రాలలో నటించింది. నందమూరి బాలకృష్ణ, నాగార్జున, తారక్, జగపతి బాబు వంటి అగ్ర నటులతో, మణిరత్నం వంటి ప్రసిద్ధ దర్శకుడి దగ్గర పని చేసిన అనుభవం ప్రియమణి కి ఉంది. తాజాగా తన పెళ్లి వార్తతో వార్తల్లో కనపడిందీ భామ.
ప్రియమణి నటించిన మన ఊరి రామాయణం ఈ నెల 7 వ తారీకున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ చిత్ర ప్రచార వేడుకల్లో పాల్గొన్న ప్రియమణి తన భవిష్యత్తు కార్యాచరణ గురించి చెప్తూ పెళ్లి కారణం చెప్పి సినిమాలకు దూరంగా ఉండాలనే నియమాలు ఏమి పెట్టుకోలేదని, ప్రేక్షకులు తనని భరించగలిగినంత కాలం నటిస్తూనే ఉంటానని సెలవిచ్చింది.