ఫైనల్ గా దసరా హీరో ఎవరంటారూ...!

Update: 2016-10-07 13:36 GMT

దసరా పండుగ, దసరా సెలవలని క్యాష్ చేసుకోవడానికి చాలామంది హీరోలు తమ సినిమాలను ఈ వారం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. మరి బరిలో నిలిచిన సినిమాలతో ఎంతమంది హీరోలు దసరా విజేతలుగా నిలిచారో ఈ రోజు విడుదలైన సినిమాలు చూసిన వారికి ఇప్పటికే అర్ధమై పోయి ఉంటుంది. ఇప్పటికే విడుదలైన సినిమాలన్నిటికీ ప్రేక్షకుల టాక్ బయటికి వచ్చేసింది.

ఈ దసరా పండుగకి తమ సినిమాల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోలలో మొదటగా నాగ చైతన్య గురించి చెప్పుకోవాలి. 'జోష్' సినిమాతో ఎంట్రీ ఇచ్చి 'ఏమాయ చేసావే' అంటూ లవర్ బాయ్ గా పాతుకు పోయిన నాగ చైతన్య మధ్యలో కొన్ని మాస్ సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు. మళ్ళీ ఈ మధ్యన ప్రేమ కథా కావ్యాలతోనే ప్రేక్షకులను పలకరించాలని మలయాళం లో సూపర్ హిట్ అయిన 'ప్రేమమ్' సినిమాని చందు మొండేటి దర్శకత్వం లో తెలుగులో రీమేక్ చేసాడు. ఇక ఈ 'ప్రేమమ్' సినిమాలో నాగ చైతన్య కి జోడి గా శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, సెబాస్టియన్ నటించారు. అయితే ఈ సినిమా విడువులైన మొదటి ఆట నుండే పాసిటివ్ టాక్ తో రన్ అవుతూ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ రివ్యూస్ వచ్చిన సినిమాగా 'ప్రేమమ్' దసరా బరిలో నిలిచింది.

ఇక సునీల్ హీరోగా 'ఈడు గోల్డెహే' సినిమా కూడా ఈ దసరా బరిలోనే ప్రేక్షకులను పలకరించింది. సునీల్ తన అన్ని సినిమాలను కామెడీని నమ్ముకునే చేస్తూ పోతున్నాడు. ఇప్పుడు వచ్చిన 'ఈడు గోల్డెహే' సినిమా కూడా కామెడీ ఎంటర్టైనర్ గానే దసరా సెలవలకి ప్రేక్షకులని పలకరించడానికి వచ్చేసింది. ఇక గత సినిమాల ప్లాప్ లతో సతమతమవుతున్న సునీల్ ఈ సినిమాతో కొంచెం పర్వాలేదనిపించాడని టాక్ బయటికి వచ్చింది.

మరో సినిమా ప్రకాష్ రాజ్ నటించి దర్శకత్వం వహించిన 'మన ఊరి రామాయణం' కూడా ఈ రోజే విడుదలైంది. ఈ సినిమా ఒక డిఫరెంట్ జోనర్ లో దసరా కానుకగా వచ్చింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నటన తో చంపేశాడని అంటున్నారు.

ఇంకో సినిమా 'అభినేత్రి' కూడా ఈ రోజే తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో విడుదలైంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా, ప్రభుదేవా, సోను సూద్ హీరోలుగా 3 భాషలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రభుదేవా డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు దసరా పండుగ కానుకగా వచ్చింది. ఇక ఈ సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ లభించినట్లు సమాచారం.

ఇక ఈ వరం విడుదలైన ఈ సినిమాలకు ఎంత కలెక్షన్స్ వచ్చాయో రేపటి నుండి ప్రచారం మొదలు పెట్టేస్తారు. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకోవాలంటే మరొక్క రోజు వెయిట్ చెయ్యాల్సిందే.

Similar News