పోస్టర్ పబ్లిసిటీకి మంగళం పాడిన కేటీఆర్

Update: 2016-12-08 19:24 GMT

సోషల్ మీడియా ప్రభావం ఉధృతంగా విస్తరించినప్పటికీ సినిమా ప్రచారాలకు వినియోగించే వాల్ పోస్టర్స్ ను రీప్లేస్ చేసే స్థాయిలో మరే ఇతర ప్రచార మార్గం ప్రాచుర్యంలోకి రాలేదు. నిరక్షరాస్యులకు కూడా అర్ధం అయ్యే విధంగా విడుదల తేదీతో పాటు చిత్ర నటీ నటులతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా ఆకర్షించే అనేక పోస్టర్లు ప్రతి ఊరులో దేశం అంతటా కనిపిస్తూనే ఉంటాయి. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చ భారత్ కూడా సినిమా వాల్ పోస్టర్స్ పై ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటికి గ్రామాలతో పాటు అభివృద్ధి చెందిన నగరాల్లోనూ సినిమా ప్రచారానికి ఇదే పంథా కొనసాగుతుంది.

తాజాగా తెలంగాణ రాష్ట్ర ఐ.టీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కే.టి.ఆర్) హైద్రాబాద్ నగరంలో ఎటువంటి ప్రచార పోస్టర్లు కానీ, లిక్విడ్ పెయింటింగ్స్ కానీ, ప్రైవేట్ సంస్థల ప్రకటనలు కానీ కనిపించటానికి వీలు లేదు అని హుకుం జారీచేశారు. అటువంటి ప్రకటనలు, పెయింటింగ్స్ హైద్రాబాద్ నగరంలో ఎక్కడ కనిపించిన సంబంధిత యాజమాన్యానికి జరిమానాతో పాటు చట్ట పరమైన చర్యలు తప్పవు అంటూ అధికారులకు బాధ్యత పెట్టారు. హైద్రాబాద్ నగరంలో కార్పొరేషన్ సంస్థ వారి దృష్టికి ఇటువంటి వాల్ పోస్టర్స్ వెళ్తే సగటు నిర్మాతకు ఇబ్బందులు తప్పవు అన్న మాట. ఈ చర్య వాణిజ్య ఉత్పత్తుల తయారీ చేసే కంపెనీలపై ఎంతటి ప్రభావం చూపుతుందో కానీ సినిమా ప్రచారం పై మాత్రం తీవ్ర ప్రభావమే చూపనుంది.

Similar News