నందమూరి ఫ్యాన్స్ కు డబుల్ కాదు, ట్రిపుల్ బొనాంజా

Update: 2016-12-11 03:18 GMT

‘‘లేటుగా వచ్చినా సరే.. లేటెస్టుగా వస్తాను’’ అనే డైలాగు పాతబడిపోయింది. ‘‘లేటుగా వచ్చినా సరే.. వెరైటీగా వస్తాను... అలరించడం మాత్రం గ్యారంటీ’’ అనేది ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ ను ఊరించే నినాదంలాగా ఉంది. అవును, ఈ ఉపోద్ఘాతం అంతా.. జూనియర్ ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో చేయబోతున్న తాజా చిత్రం గురించే! నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించే ఈ చిత్రంలో జూనియర్ డబుల్ యాక్షన్ చేయబోతున్నట్లు ఇదివరలో వార్తలు వచ్చాయి. అయితే వాస్తవానికి ఇందులో ఆయన మూడు పాత్రలు పోషించబోతున్నారట. అంటే ట్రిపుల్ బొనాంజా అన్నమాట.

అధికారికంగా ఈ సంగతిని ఎవ్వరూ వెల్లడించలేదు. అయితే చిత్రంలో ముగ్గురు హీరోయిన్లుంటారనే సంగతి మాత్రం అధికారికంగానే బయటకు వచ్చింది. తాజాగా హీరోలు కూడా ముగ్గురే అని తెలుస్తోంది. రెండు పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించడం అనేది ఎన్టీఆర్ కు బాగానే అలవాటు అయింది. ఎన్టీఆర్ వీరకామెడీ పండించిన చిత్రాల్లో అదుర్స్ గురించి ఎప్పటికీ చెప్పుకోవాల్సిందే. అందులో రెండు పాత్రలు పూర్తి వైవిధ్యంతో జూనియర్ రక్తి కట్టించారు.

అదే సమయంలో.. ఆంధ్రావాలా, శక్తి లాంటి చిత్రాల్లో తండ్రీ కొడుకులుగా రెండేసి పాత్రలు పోషించారు. అయితే అవి అంత గొప్ప ఫలితాలను ఇచ్చిన చిత్రాలు కాదు.

తాజాగా మూడు పాత్రలు చేయబోతున్న బాబీ చిత్రంలో పైన చిత్రాల్లోని రెండు ఫార్మాట్లను మిక్స్ చేసి ఒక తండ్రి ఇద్దరు కొడుకులుగా చేస్తారా, లేదా ముగ్గురూ సోదరులుగానే చేస్తారా అనేది తెలియడంలేదు. నందమూరి ఫ్యాన్స్ కు మాత్రం ఇది పండగలాంటి వార్తే. వెండితెర మీద ఒక జూనియర్ కనిపిస్తేనే ఫ్యాన్స్ కిర్రెక్కిపోతుంటారు. అలాంటిది.. ఏకంగా ముగ్గురు ఎన్టీఆర్ లు కనువిందు చేస్తే.. ఇక దబిడిదిబిడే!

Similar News