తెలుగు పరిశ్రమపై తాప్సీ నీలాపనిందలు

Update: 2016-10-02 09:41 GMT

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పరిచయం చేసిన కథానాయికల్లానే తాప్సి పన్ను కూడా తెలుగు పరిశ్రమలో తార స్థాయికి చేరుకుంటుంది అని భావించారు అంతా. కానీ తెలుగు పరిశ్రమలో నెలకున్న కథానాయికల తీవ్ర పోటీ లో నెగ్గుకు రాలేకపోయింది ఈ భామ. అవకాశాలు కూడా తగ్గు ముఖం పట్టటంతో అనేక సినిమా మ్యాగజైన్స్ కవర్ ఫొటోలకి అందాలు ఆరబోస్తూ కాలక్షేపం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశం వస్తుంది అని నమ్మకం కోల్పోయిందో ఏమో తన అదృష్టాన్ని పరీక్షించుకోటానికి మద్రాస్ పట్నంలో మకాం పెట్టి కాంచన2 తో సక్సెస్ ట్రాక్ ఎక్కింది. అక్కడి నుంచి హిందీ చిత్రాల్లో నటిస్తూ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుంది.

బేబీ, పింక్ చిత్రాల విజయాలతో బాలీవుడ్ లో పాగా వేసింది తాప్సి పన్ను. అక్కడ అవకాశాలు దండిగా ఉండటం వల్లేమో తెగించి తెలుగు పరిశ్రమ మీద తనకు ఉన్న వ్యతిరేక భావాన్ని వ్యక్త పరిచింది. తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలు తనను మోసగించారు అని, తాను నటించిన చిత్రాలు విజయవంతంగా ప్రదర్శితమైనా కూడా తనకి రావాల్సిన పారితోషికాలు ఇచ్చేవారు కాదు అని, కథానాయకులకు మాత్రం చిత్రం పరాజయం చెందినా పారితోషికం ఆపేవారు కాదు అని వాపోయింది. తాప్సి కడుపు మంట చూస్తుంటే ఇకపై తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేయటానికి విముకతతో ఉన్నట్టు ఉంది.

తాప్సి నటించిన హిందీ చిత్రం రన్నింగ్ షాదీ డాట్ కామ్ విడుదల కు తయారు అవుతుంది. ఘాజి, తడ్కా, నామ్ షబానా వంటి మరో మూడు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

Similar News