సినిమా పరిశ్రమ లో సక్సెస్ రేషియో బాగా తక్కువ. పైగా ఆ పరిశ్రమలో ఎదగాలని తాపత్రయపడే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇంత డిమాండ్ వున్నా పరిశ్రమ కాబట్టి విజయం లేకపోతే అవకాశాలు దొరకటం చాలా కష్టం. కానీ ఆ విజయం ఇవ్వటానికి అయినా తొలి అవకాశం అంటూ ఒకటి దక్కాలి కదా! సరిగ్గా ఇక్కడే ఎందరో యువత సినీ పరిశ్రమకి అర్హులు కానివారుగా మిగిలిపోతున్నారు. నిర్మాతల దృష్ట్యా చూస్తే వారు ఎందరో నటులు, సాంకేతిక నిపుణుల విలువైన సమయాన్ని, ప్రతిభని, కష్టాన్ని, తన సంపదని కూడగట్టి సినిమా నిర్మిస్తుంటారు కాబట్టి వారు ఒక కొత్త సాంకేతిక నిపుణుడికి అవకాశం కలిపించి అది కానక మిస్ఫైర్ అయితే దాని పరిణామాలు ఎందరి మీదనో ప్రభావం చూపుతాయి. మరోవైపు దిల్ రాజు వంటి కొందరు నిర్మాతలు సీనియర్ మోస్ట్ టెక్నిషన్స్ తో సినిమాలు తీస్తూనే కొత్తవారికి కూడా అవకాశాలు ఇస్తున్నారు. ఆయన కథ దశలోనే కొత్త వారి ప్రతిభను పసిగట్టగల నైపుణ్యం కలిగిన నిర్మాత. అందుకే దిల్ రాజు కొత్త వారికి అవకాశం ఇచ్చిన పలు సినిమాలు కూడా సేఫ్ గేమ్ గా బిజినెస్ చేశాయి.
ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద సంచలనం గా నిలిచిన పెళ్లి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి ఆ చిత్రంతో దర్శకుడు తరుణ్ భాస్కర్ తో పాటు పలు హాస్య నటులు ని కొత్త వారిని ప్రోత్సహించి అతి చిన్న సినిమాగా విడుదల చేసి తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఓవర్ సీస్ లోనూ భారీ విజయాన్ని నమోదు చేసాడు. ఇక తన రెండవ చిత్రం కూడా కొత్త వారికే అవకాశం ఇవ్వాలని నిశ్చయించుకుని పలు లఘు చిత్రాలు దర్శకత్వం వహించిన వివేకా ఆత్రేయ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మెంటల్ మదిలో అనే చిత్రాన్ని తీస్తున్నాడు రాజ్ కందుకూరి. శ్రీ విష్ణు కథానాయకుడిగా నటిస్తున్నాడు. పెళ్లి చూపులు సక్సెస్ తరువాత ఇండస్ట్రీలో స్టార్స్ ని అప్రోచ్ అవ్వాల్సింది కదా అనే ప్రశ్నకు సమాధానంగా, "పెళ్లి చూపులు కథ తరుణ్ భాస్కర్ చెప్పినప్పుడు ఒక ఫ్రెష్ కంటెంట్ తెరకెక్కుతుంది అనే నమ్మకంతో సినిమా తీసాను తప్పితే ఆ చిత్రం నాకు స్టార్స్ కాల్ షీట్స్ సంపాదించుకోవడానికి పెట్టుబడిగా తీయలేదు. ఇప్పుడు మెంటల్ మదిలో చేస్తున్న వివేక్ ఆత్రేయ కూడా చాలా ప్రతిభ వున్న కుర్రాడు. నాకు ఇలాంటి ఫ్రెషర్స్ ప్రతిభని ఆవిష్కరించే సినిమాలతోనే తృప్తి దొరుకుతుంది. ఒకవేళ స్టార్స్ మాత్రమే హేండిల్ చేయగలిగిన కథ ఉంటే కచ్చితంగా ఆ కథని బేస్ చేసుకుని స్టార్స్ ని అప్రోచ్ అవుతాను తప్ప, గత చిత్రం హిట్ ఐయ్యింది అనే నెపంతో మాత్రం కాదు." అని చెప్పాడు నిర్మాత రాజ్ కందుకూరి.