కుర్ర దర్శకుడికి ఈ అవకాశం పెద్ద సవాలే

Update: 2016-12-11 11:40 GMT

అగ్ర దర్శకుల వద్ద దర్శకత్వ శాఖ లో పని చేసినప్పటికీ అందరికి దర్శకుడిగా నిరూపించుకునే అవకాశం దొరకదు. దొరికిన కొద్ది మందిలోనూ ఆ అవకాశాన్ని సద్వినియోగ పరచుకుని ప్రతిభ నిరూపించుకునే వారు చాలా అరుదు. ఇటువంటి అరుదైన వారి జాబితాలో చోటు దక్కించుకున్నాడు యువ దర్శకుడు రవీంద్ర(బాబీ). మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దగ్గర కొంత కాలం దర్శకత్వ విభాగంలో పనిచేయటంతో పాటు ప్రముఖ రచయిత కోన వెంకట్ తో కలిసి పలు చిత్రాలకు రచనా సహకారం కూడా అందిచాడు బాబీ. మాస్ మహారాజ రవితేజ ఇచ్చిన అవకాశంతో దర్శకుడిగా తన అడుగులు మొదలు పెట్టి తొలి ప్రయత్నం పవర్ చిత్రం తో విజయం అందుకున్నాడు.

పవర్ చిత్రం పూర్తి ఐయి బాబీ తన తదుపరి ప్రాజెక్ట్ సిద్ధం చేసుకునే టైంలో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం నుంచి సంపత్ నంది తప్పుకోవడంతో ఆ అవకాశం బాబీ కి దక్కింది. ఇక ఈ కుర్ర దర్శకుడికి తిరుగులేదు అనే అనుకున్నారు అంతా. కానీ విడుదల తరువాత అంచనాలు తారుమారు ఐయి చిత్రం పరాభవం చెందింది. దాని వలన బాబీ ని ఎవరు వేలు ఎత్తి చూపలేదు. దీనికి కారణం సర్దార్ గబ్బర్ సింగ్ కథ కథనాలు స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రచించుకోవటమే. కానీ బాబీ తదుపరి ప్రాజెక్ట్ పట్టాలెక్కే క్రమంలో తిరస్కారాలతో ఆలస్యానికి గురవుతూ వచ్చింది ఈ పరాభవం పుణ్యమా అని.

జనతా గ్యారేజ్ తరువాత ఎటువంటి చిత్రం చెయ్యాలో అనే స్పష్టత కరువై వివిధ దర్శక రచయితలకు అవకాశం ఇచ్చిన తారక్ కథా చర్చలు పూర్తి అవగానే వారికి మొండి చేయి చూపుతుండటం గత కొంత కాలంగా జరుగుతూనే వుంది. ఇందుకు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, ప్రముఖ రచయిత వక్కంతం వంశి కూడా అతీతులు కారు. ఈ తరుణంలో తారక్ తన తదుపరి చిత్ర అవకాశం బాబీ కి ఇవ్వటంతో అందరూ షాక్ కి గురైయ్యారు. ఈ చిత్రం పట్టాలెక్కి బాబీ తారక్ కి అద్భుతమైన విజయం అందిస్తే బాబీ కెరీర్ కి తిరుగు ఉండదు. ఒకవేళ ఈ చిత్రం అంచనాలు అందుకోలేకపోతే అప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ వైఫల్యం కూడా బాబీ వ్యక్తిగత పరభావంగానే పరిగణించే ప్రమాదము కూడా వుంది. దీనితో బాబీ కి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకంగా మారనుంది.

Similar News