చిత్ర పరిశ్రమకు వచ్చి 13 సంవత్సరాలు గడిచిపోయినా అందాల తార నయనతార అవకాశాలకు కొదవ లేదు. తెలుగు, మలయాళ, తమిళ భాషలలో చేతి నిండా అవకాశాలు ఉన్న నాయిక నయన్. తాజాగా బాబు బంగారంతో వెంకటేష్ తో ముచ్చటగా మూడవ సారి జత కట్టి వారి కలియిక విజయ పరంపర కొనసాగించింది. బాబు బంగారం చిత్రం సోలో హీరోగా వెంకటేష్ కెరీర్లోనే అధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అదే విధంగా తమిళ భాషలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు చిరునామాగా నిలిచింది నయనతార. నీ ఎంగే ఎన్ ఎంబేయ్, మాయ వంటి చిత్రాలే అందుకు నిదర్శనం.
ప్రస్తుతం నయనతార కాష్మోరా చిత్రంలో పోషిస్తున్న పాత్ర అభిమానులలో, ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తిస్తుంది. మహా రాణి పాత్రలోని నయన్ ప్రచార చిత్రం విడుదల చేసిన నాటి నుంచి ఆ పాత్రలో నయన్ కనబర్చే అభినయం పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రత్న మహాదేవి అనే మహా రాణి పాత్రను పోషిస్తుంది నయన్. ఆ పాత్ర కోసం కత్తి పట్టుకుని ఉన్న కొన్ని ఫోటో షూట్ లోని చిత్రాలను సామాజిక మాంద్యం ద్వారా విడుదల చేసారు. రమ్య క్రిష్ణ ను శివగామిగా, అనుష్క ను రుద్రమదేవి గా నెత్తిన పెట్టిన సినీ ప్రేక్షకులు నయనతార పాత్రను కూడా అదే స్థాయిలో గుర్తుపెట్టుకుంటారని విశ్వాసం వ్యక్తం చేస్తుంది కాష్మోరా చిత్ర బృందం.
నయనతార కాష్మోరా చిత్రంతో పాటు తమిళం లో మరో మూడు చిత్రాలలో నటిస్తుంది. దొర, ఇమ్మైక నోడింగల్, పేరు ఖరారు చెయ్యని మింజుర్ గోపి చిత్రంలోనూ ప్రధాన పాత్రలు పోషిస్తుంది.