ఈ కమెడియన్ భవిష్యత్ ఎలా వుండబోతుందో?

Update: 2016-12-08 20:00 GMT

పాత తరం హాస్య నటుల నుంచి వస్తున్న ఆనవాయితీ పాటిస్తున్నారు నేటి తరం హాస్య నటులు. రేలంగి గారి నుంచి ధనరాజ్ వరకు దాదాపుగా అందరూ హాస్య నటులు ఏదో ఒక సందర్భంలో కథానాయకుడిగా ప్రయత్నాలు చేసినవారే. అయితే వారిలో విజయం పొందినవారు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తారు. బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, వెన్నెల కిషోర్, ధన రాజ్ వంటి పలు హాస్య నటులు కథానాయకుడిగా ప్రయత్నాలు చేసి విఫలం కాగా శ్రీనివాస్ రెడ్డి హాస్య నటుడిగా అలరిస్తూనే అడపా దడపా కథానాయకుడిగా మెరుస్తున్నాడు. సునీల్ పూర్తిగా కథానాయకుడిగా స్థిరపడిపోయారు. హాస్య నటులు హీరోలుగా అతి తక్కువ సక్సెస్ రేట్ తో కెరీర్ మందగిస్తున్న తరుణంలో సప్తగిరి భవిష్యత్ ఎలా ఉంటుందో అనే చర్చ జోరుగా సాగుతుంది.

హాస్య నటుడిగా ఎంతో బిజీగా వున్న కాలంలోనే కాల్ షీట్స్ మొత్తం ఒక్క చిత్రంలో కథానాయకుడిగా నటించటానికి కేటాయించే సాహసం చేసాడు సప్తగిరి. తొలి నుంచి పెద్దగా అంచనాలు లేనప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకకు హాజరు ఐన నాటి నుంచి క్రేజ్ పెరిగిపోయింది సప్తగిరి ఎక్ష్ప్రెస్స్ కి. ఈ నెల 23 న విడుదల అవుతున్న సప్తగిరి ఎక్ష్ప్రెస్స్ సప్తగిరి పూల బాట వేయనుందో లేక మొట్టికాయలు వేయనుందో ఆ చిత్ర ఫలితం తేల్చాల్సి వుంది. సప్తగిరి కి ప్రస్తుతానికి హాస్య నటుడిగా అవకాశాలు దండిగానే వున్నాయి. కేవలం కథానాయకుడిగానే కొనసాగాలి అనే అత్యాశతో ఈ అవకాశాలు వదులుకుంటే సప్తగిరి కెరీర్ బోల్తా పడటం ఖాయమే. సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడినా హాస్యనటుడిగా కొనసాగుతూనే కథానాయకుడిగా ప్రయత్నాలు సాగిస్తే మంచిది అనే అభిప్రాయలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Similar News