‘అమ్మ’ కోసం.. బర్త్ డే వద్దంటున్న సూపర్‌స్టార్

Update: 2016-12-10 03:00 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు. అమ్మ జయలలిత మరణంతో.. తమిళనాడు విషాదంలోమునిగిఉన్న తరుణంలో తన పుట్టిన రోజు పేరిట అభిమానులు అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించడం సబబు కాదని సూపర్ స్టార్ రజనీ భావించినట్లుంది. పైగా స్వయంగా తాను కూడా జయలలిత మరణం పట్ల దుఃఖంలో ఉన్న సంగతి కూడా దృష్టిలో ఉంచుకుని ఆయన రెండు రోజులు ముందుగానే.. అభిమానులకు సూచన చేశారు.

డిసెంబరు 12న సోమవారం రజనీకాంత్ పుట్టిన రోజు. ఈ ఏడాది ఆయన 66వ ఏట అడుగుపెడుతున్నారు. గత ఏడాది కూడా రజనీ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోలేదు. అప్పట్లో చెన్నై నగరాన్ని వరదలు అతలాకుతలం చేసేశాయి. ఆ బీభత్సానికి విషాదసూచికగా ఆయన పుట్టినరోజు వేడుకల్ని రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది జయలలిత మరణం తమిళ సీమలో స్తబ్ధతను సృష్టించింది. నిజానికి జయలలిత మరణం సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం 7 రోజులు సంతాపదినాలను ప్రకటించింది. ఆరోజుల్లోనే వచ్చే తన పుట్టిన రోజును అభిమానులు ఎవరూ ఆర్భాటంగా జరపవద్దని రజనీ విన్నవించడం విశేషం. మామూలు పరిస్థితుల్లో అయితే తలైవా పుట్టినరోజు ఆయన అభిమానులకే పండగే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Similar News