Telangana : హాలీవుడ్ లో భద్రాచలం యువకుడి ప్రతిభ చూశారా?

తెలంగాణలోని భద్రాచలానికి చెందిన యువ దర్శకుడు కొండపల్లి వివేకానంద దర్శకత్వం వహించిన ది లాస్ట్ విజిల్ సినిమా తెలంగాణ–హాలీవుడ్ మధ్య దూరాన్ని తగ్గించింది

Update: 2025-10-30 05:52 GMT

తెలంగాణలోని భద్రాచలానికి చెందిన యువ దర్శకుడు కొండపల్లి వివేకానంద దర్శకత్వం వహించిన ది లాస్ట్ విజిల్ సినిమా తెలంగాణ–హాలీవుడ్ మధ్య దూరాన్ని తగ్గించింది. 34ఏళ్ల ఈ దర్శకుడి తొలి ఆంగ్ల చిత్రం డిసెంబరులో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యూట్యూబ్‌లో విడుదలైన ట్రైలర్ రెండు రోజుల్లోనే మూడు లక్షలకుపైగా వ్యూస్ సాధించింది. భద్రాచలం‌ ప్రాంతానికి చెందిన మహేష్, జమునారాణి దంపతుల పెద్ద కుమారుడు వివేకానంద, ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం భార్య, పిల్లలతో న్యూయార్క్‌లో నివసిస్తున్నాడు.

షార్ట్ ఫిల్మ్ తో...
తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన మహేష్ గాయకుడు కూడా. తన తండ్రి పాటలు, కథలతో పెరిగినట్లు వివేకానంద తెలిపారు. తన సృజనాత్మక దృక్పథానికి నాన్న ప్రభావమే కారణమని వివేకానంద తెలిపారు. తెలుగు షార్ట్ ఫిల్మ్ *‘తుల’*కు సంభాషణలు రాసిన వివేకానంద తర్వాత, రెండు హాలీవుడ్‌ షార్ట్ ఫిల్మ్‌లకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. వాటిలో *‘ది లాస్ట్ విజిల్’*లో కేథరిన్‌ కర్టిన్‌ వంటి నటీనటులు నటించారు.
11.50 కోట్ల ఖర్చుతో...
తొంభయి ఐదు నిమిషాల నిడివి గల ఈ చిత్రాన్ని 1.3 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు ₹11.48 కోట్లు) వ్యయంతో నిర్మించారు. రాబోయే క్రిస్మస్‌ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 300 థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. వివేకానంద ప్రస్తుతం మరో హాలీవుడ్‌ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు చర్చలు జరుపుతున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత ఒక తెలుగు సినిమా తెరకెక్కించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. వివేకానంద హాలీవుడ్ లో సక్సెస్ కావాలని ఆశిద్దాం. ఒక తెలుగు యువకుడు సాధించిన ఘనతను ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే.


Tags:    

Similar News