Vijay Devarakonda : మళ్లీ రైజ్ అవుతాడా..? ఈ నెలాఖరుకు విజయ్ ఫ్యాన్స్ కు తీపి కబురు అందుతుందా?
విజయ్ దేవరకొండకు వరసగా ప్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. కింగ్ డమ్ మూవీ ఈ నెల 31న విడుదలవుతుంది
రౌడీ హీరో విజయ్ దేవరకొండ మెగాస్టార్ చిరంజీవి తరహాలో స్వయం కృషితో చిత్ర పరిశ్రమలోకి వచ్చి నిలదొక్కుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి అనతి కాలంలోనే లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే తొలినాళ్లలో హిట్లు విజయ్ దేవరకొండను ఎక్కడో నిలెబట్టాయి. అతనికి ప్రత్యేక మైన ఫ్యాన్స్ ఏర్పడటానికి కారణమయ్యాయి. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా చేరిపోయారు. తర్వాత వచ్చిన గీతా గోవిందంలో కూడా విజయ్ తన నటనతో అందరినీ మెప్పించాడు. ఇక విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో తిరుగులేదనట్లుగా ఒక రేంజ్ లోకి చేరుకున్నాడు.
వరస ప్లాపులతో...
అయితే విజయ్ దేవరకొండకు వరసగా ప్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. వరసగా ఐదు సినిమాలు బాక్సాఫీసు ముందు బోల్తా పడటంతో విజయ్ అభిమానులు కూడా నిరాశ చెందారు. తమ అభిమాన హీరో ఖచ్చితంగా రెండు వందల కోట్ల క్లబ్బులో చేరాలని అనుకుంటే ఈ ప్లాపులేంటంటూ మదన పడిపోతున్నారు. వరసగా డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషీ, ఫ్యామిలీ స్టార్ సినిమాలు విజయ్ రౌడీ బ్రాండ్ ను దెబ్బతీశాయి. దీంతో ఇప్పుడు విజయ్ తో పాటు అతని అభిమానులు త్వరలో విడుదలయ్యే కింగ్ డమ్ మూవీపైనే ఆశలు పెట్టుకున్నారు.
కింగ్ డమ్ మూవీతో...
కింగ్ డమ్ మూవీతో తిరిగి విజయ్ రైజ్ అవ్వడం ఖాయమన్న అంచనాలు బాగా వినిపిస్తున్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 31వ తేదీన విడుదల కానుంది. గౌతమ్ తిన్ననూరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా, విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. అయితే విజయ్ కి డెంగ్యూ సోకి ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం ఏదీ రాకపోయినా విజయ్ మాత్రం ఆసుపత్రికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది. మరొకవైపు విజయ్ దేవరకొండ రెండు గోడలను ఆసరాగా చేసుకుని పైకి ఎక్కే వీడియాలో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. విజయ్ అనారోగ్యంపై ప్రచారం చేయవద్దంటూ కామెంట్స్ పెడుతూ ఈ వీడియోను ఆయన అభిమానులు పోస్టు చేస్తున్నారు.