పోలీసు కంప్లైంట్ ఇచ్చిన పూరీ జగన్నాథ్.. ప్రాణహాని ఉందట

Update: 2022-10-27 01:39 GMT

పూరీ జగన్నాథ్ తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించడం సంచలనం రేపుతోంది. 'లైగర్' సినిమా డిస్ట్రిబ్యూటర్ల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న పూరీ జగన్నాథ్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి పోలీసులు రక్షణ కల్పించాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 12 ఏప్రిల్ 2022 నాటి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ ప్రకారం వరంగల్ శ్రీను డిఫాల్ట్ అయ్యాడని, తన సబ్ డిస్ట్రిబ్యూటర్‌లకు మొత్తాలను చెల్లించాల్సి ఉందని, దానిని డిఫాల్ట్ చేస్తున్నాడని పూరీ జగన్నాథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఆ చిత్ర డిస్టిబ్యూటర్లు వరంగల్ శ్రీను, శోభన్ బాబులు తనను వేధిస్తున్నారని.. శ్రీను, శోభన్‌లు డబ్బుల విషయంలో తనను, తన కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని, వారి నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తన బాధ్యత నుండి తప్పించుకోవడానికి వంగల్ శ్రీను సబ్ డిస్ట్రిబ్యూటర్లను రెచ్చగొడుతున్నాడని పూరి తన ఫిర్యాదులో కొనసాగించాడు.
తన ఇల్లు, కార్యాలయంపై దాడులు చేస్తామని.. బెదిరించే అక్రమ మార్గంలో కాకుండా డిస్ట్రిబ్యూటర్లు ఏదైనా కోర్టులో సివిల్ కేసు వేయవచ్చని కూడా పూరీ ఈ ఫిర్యాదు ద్వారా పరోక్షంగా సూచించారు. రెండు రోజుల క్రితం పూరీ వాయిస్‌తో విడుదలైన ఆడియో ఫైల్ కూడా వైరల్‌గా మారింది. 'లైగర్' వల్ల నష్టపోయిన బాధితులంతా తన ఇంటి ముందు ధర్నా చేయబోతున్నారని.. తన పరువు తీసేందుకు కుట్ర చేస్తున్నారని పూరీ ఆడియో కాల్ లో తెలిపాడు. డబ్బు తిరిగి చెల్లిస్తానని చెప్పినా పలువురు డిస్ట్రిబ్యూటర్లు బెదిరింపులకు పాల్పడ్డారని పూరీ ఆరోపించారు.


Tags:    

Similar News