Kota Srinivasa Rao : టాలీవుడ్ లో విషాదం.. కోట శ్రీనివాసరావు మృతి

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణించారు.

Update: 2025-07-13 01:48 GMT

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణించారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కోట శ్రీనివాసరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హాస్యనటుడిగా అందరినీ మెప్పించి దాదాదాపు 750కి పైగా సినిమాల్లో నటించారు. ఒకానొక సమయంలో కోట శ్రీనివాసరావు లేకుండా సినిమా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. కోట శ్రీనివాసరావు ఏ పాత్ర వేసినా అందులో ఇమిడిపోతూ సహజత్వం ఉట్టిపడే డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరించేవారు.

ప్రేమాభిషికేం ద్వారా...
కోట శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నూజివీడులో 1947లో జన్మించారు. ఆయనకు చిన్నప్పటి నుంచే నటన అంటే మంచి ఆసక్తి. నాటకాల్లో చేస్తూ వెండి తెరమీదకు వచ్చిన కోట శ్రీనివాసరావును 1978లో విడుదలయిన ప్రేమాభిషేకం ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. తర్వాత ఆఖరిపోరాటం సినిమాతో గుర్తింపు వచ్చింది. తర్వాత ఇక ప్రతిఘటన సినిమాలో ఆయన నటనకు యావత్ తెలుగు ప్రజలు ఫిదా అయిపోయారు. విలన్ పాత్రలో రాణించడంతో కొన్నాళ్ల పాటు ఆయన విలన్ గానే ఎక్కువ సినిమాలు చేసే వారు. అనేక సినిమాల్లో విలన్ పాత్రలు చేసిన ఆయన ప్రేక్షకుల మనసులో కోట శ్రీనివాసరావు ఉన్నాడటంటే ఖచ్చితంగా హిట్ అన్న టాక్ కూడా తెచ్చుకున్నాడు.
హాస్యనటుడిగా.. ఎమ్మెల్యేగా...
తర్వాత క్రమంగా హాస్యనటుడిగా కూడా మారాడు. జంద్యాల దర్శకత్వంలో వచ్చిన అహ నా పెళ్లంట సినిమాలో పిసినారి పాత్రలో యావత్ ఆంధ్రప్రజలను ఇళ్లలో నవ్వులు పూయించారు. మామగారు సినిమాలో కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ కాంబినేషన్ సూపర్ హిట్ కావడంతో ఇక వీరిద్దరి కాంబినేషన్ అనేక సినిమాల్లో తిరుగులేకుండా పోయింది. చివరిగా కోట శ్రీనివాసరావు 2023లో విడుదలయని సువర్ణ సుందరిలో కనిపించారు. తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. అస్వస్థతకు గురయిన ఆయన ఇంటికే పరిమితమయ్యారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అనేక మంది నటీనటులు ఆయన మృతికి విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు. .కోట శ్రీనవాసరావుకు ఉత్తమ్ విలన్, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వంటి అవార్డులు మొత్తం తొమ్మిది సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నంది పురస్కరాలు అందుకున్నారు. ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేగా కూడా గెలిచి రాజకీయాల్లోనూ రాణించారు


Tags:    

Similar News