జగన్ దగ్గరకు కూడా రానివ్వడం లేదెందుకో?

మోహన్ బాబు ఫ్యామిలీని జగన్ దూరం పెట్టారన్న టాక్ టాలీవుడ్ లో బలంగా విన్పిస్తుంది.

Update: 2022-02-11 02:52 GMT

మోహన్ బాబు ఫ్యామిలీని జగన్ దూరం పెట్టారన్న టాక్ టాలీవుడ్ లో బలంగా విన్పిస్తుంది. మోహన్ బాబు వైసీపీలో చేరి గత ఎన్నికలకు ముందు మంచి హైప్ తెచ్చారు. చంద్రబాబుపై విమర్శలు చేసి ఆయన సామాజికవర్గంతో పాటు సామాన్యులలో కొంత మార్పు తీసుకు వచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే మోహన్ బాబు ఖచ్చితంగా ఏదో ఒక పదవి లభిస్తుందని అందరూ భావించారు. కానీ పదవి మాట దేవుడెరుగు అసలు జగన్ దగ్గరకు కూడా రానివ్వడం లేదన్న చర్చ జరుగుతుంది.

సీనియర్ నటుడిగా....
మోహన్ బాబు సీనియర్ నటుడు. చిరంజీవి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోయినా టాలీవుడ్ లో దాసరి నారాయణరావు తర్వాత సమస్యలు తెలిసిన వ్యక్తిగా మోహన్ బాబును చూస్తారు. ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నారు. టీటీడీ ఛైర్మన్ పదవి దక్కుతుందని అనుకున్నా, రెండుసార్లు జగన్ ఆ పదవిని తన బంధువు వైవీ సుబ్బారెడ్డికే ఇచ్చారు. ఇప్పుడు కనీసం సమావేశాలకు కూడా మోహన్ బాబును దూరంగా జగన్ పెట్టడం విశేషం.
మంచు విష్ణును....
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు కూడా నిన్న జగన్ తో టాలీవుడ్ సమావేశానికి ఆహ్వానం లేదు. దీనికి కారణం తన బంధువులు కావడమేనని అంటున్నారు. జగన్ తన కుటుంబ సభ్యులు ఎవరినీ అనుమతించకూడదని, అందుకే ఆలీ, పోసానిని ప్రత్యేకంగా పిలిచారని అంటున్నారు. దీనిపై మంచు మోహన్ బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇటు చంద్రబాబుకు బంధువులు, సన్నిహితులకు కూడా జగన్ కార్యాలయం నుంచి ఆహ్వానం అందలేదు.


Tags:    

Similar News