సాయి పల్లవి.. ఆమె తెరపై కనపడితే చాలు.. అదోరకమైన అనుభూతి

సాయి ఈరోజు పల్లవి 30వ పుట్టినరోజును జరుపుకుంటోంది. మలయాళం 'ప్రేమమ్' సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆమె మొదటి సినిమాతోనే..

Update: 2022-05-09 04:33 GMT

హైదరాబాద్ : సాయి పల్లవి.. ఈ పేరు వింటే చాలు యూత్ ఫిదా అయ్యామని చెబుతారు. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ సాధారణమైనది కాదు. ఈరోజు సాయి పల్లవి పుట్టినరోజు. అభిమానులందరూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు. దక్షిణాది సినీ పరిశ్రమలో సాయి పల్లవి పాపులర్ హీరోయిన్ అయినప్పటికీ ఆమెకు తెలుగు అభిమానులతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తమిళనాడులోని నీలగిరి జిల్లా కోటగిరిలోని సెంతమరై కన్నన్, రాధ దంపతులకు జన్మించింది. సాయి పల్లవికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. ఎక్కడా శిక్షణ తీసుకోకుండానే తనకు నచ్చిన మ్యూజిక్ వింటూ తనదైన స్టైల్లో స్టెప్పులేసేది. జార్జియాలోని టిబిలిసి మెడికల్ యూనివర్సిటీలో డాక్టర్ కోర్సు పూర్తిచేసింది. ఆమెకు డ్యాన్స్ మీదున్న ప్రేమతో 2009లో ఓ తెలుగు ఛానల్లో నిర్వహించిన డ్యాన్స్ షోలో పాల్గోని ఫైనలిస్ట్ గా నిలిచింది. ఆ తర్వాత 2008లో జయం రవి హీరోగా తెరకెక్కిన ధామ్ ధామ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపిస్తుంది.

సాయి ఈరోజు పల్లవి 30వ పుట్టినరోజును జరుపుకుంటోంది. మలయాళం 'ప్రేమమ్' సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆమె మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. సాయి పల్లవి ఎప్పుడూ నటి కావాలని అనుకోలేదు.. ఆమెకు మెడిసిన్ పట్టా ఉంది. నటి కాకపోతే సాయి పల్లవి కార్డియాలజిస్ట్ అయ్యేది. 2014లో చదువుతున్నప్పుడే 'ప్రేమమ్' సినిమాలో 'మలర్' పాత్రకు ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత ఆమె ఓవర్ నైట్ సెన్సేషన్ అయింది. ఆమెకు సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో కూడా అమ్మడు దూసుకుపోతోంది. ఇప్పటివరకు కేవలం 15 సినిమాల్లోనే నటించిన పల్లవి.. తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీని అందుకుంది.
సాయి పల్లవి గురించి అభిమానులకు నచ్చే విషయం ఏమిటంటే.. ఆమె మేకప్ లేకుండా సినిమాల్లో కనిపిస్తుంది. న్యాచురాలిటీ ముఖ్యమని ఆమె చెబుతోంది. ఇక రెండు కోట్ల ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల ప్రకటనను కూడా సాయి పల్లవి చాలాసార్లు తిరస్కరించింది. సాయి పల్లవి సౌందర్య సాధనాల పట్ల తనకున్న అయిష్టత గురించి మాట్లాడుతూ, తాను ఎప్పుడూ అందంగా కనిపించడానికి మేకప్‌ను ఉపయోగించనని, ప్రజలను గందరగోళానికి గురిచేసే ఏదైనా ప్రచారంలో భాగం కావడానికి ఇష్టపడనని చెప్పింది.
ఇక సాయి పల్లవి యాక్టింగ్ తో పాటూ డ్యాన్స్ అంటే చాలు ఒక ఊపు తెప్పిస్తుంది. తన పాత్రకు ప్రాధాన్యత ఉండే కథలను ఎంచకుంటూ ఎన్నో విజయాలను అందుకుంది సాయి పల్లవి. ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి, కణం, పడి పడి లేచె మనసు, మారి 2, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో నటించి మెప్పించింది. రానా దగ్గుబాటి సరసన నటించిన విరాట పర్వం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Tags:    

Similar News