విష‌యం లేకుంటే ఎలాంటి హీరో న‌టించినా చూడ‌రంటున్న రామ్ చరణ్ తేజ్.. ఏ సినిమా గురించంటే..?

Update: 2022-11-13 02:36 GMT

ఇటీవల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం చాలా సవాల్ తో కూడుకున్న పని. ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా కూడా కంటెంట్ లేదంటే కనీసం థియేటర్ల వైపు కన్నెత్తి చూడడం లేదు. ముందు లాగా భారీ కలెక్షన్స్ రావడం కూడా కష్టమవుతోంది. వారాల కొద్దీ పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో ఆడడం కూడా లేదు. ఇదే విషయం పలు హీరోలకు అనుభవం లోకి వచ్చింది. బాలీవుడ్ లోని ఎంతో మంది స్టార్ హీరోలు కనీసం కలెక్షన్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. టాలీవుడ్ లో కూడా ఇలాంటి అనుభవమే పలు హీరోల విషయంలో ఎదురైంది. తాజాగా రామ్ చరణ్ తేజ్ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. కంటెంట్ లేకుండా సినిమాలను చూడరని.. తనకు కూడా ఆచార్య సినిమాతో అదే విషయం తెలిసిందని అన్నాడు.

హిందుస్థాన్ టైమ్స్ లీడ‌ర్ షిప్ స‌మ్మిట్‌లో పాల్గొన్న చ‌ర‌ణ్ ఆచార్య సినిమా సినిమా పేరు చెప్పకుండా.. చాలా విషయాలను వెల్లడించాడు. RRR భారీ స‌క్సెస్ అయ్యాక త‌న నుంచి ఒక సినిమా రిలీజ్ జ‌రిగింద‌ని.. అందులో తాను గెస్ట్ రోల్ లాంటిది చేశాన‌ని తెలిపాడు.(రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేసింది ఆచార్యలో అనే సంగతి తెలిసిందే) కానీ ఆ సినిమా చూసేందుకు ఎవ్వ‌రూ ముందుకు రాలేద‌ని చ‌ర‌ణ్ చెప్పుకొచ్చాడు. ప్రేక్ష‌కులు కంటెంట్ బాగుంటేనే చూస్తారు, థియేట‌ర్ల‌కు వ‌స్తారు అన‌డానికి ఇది రుజువ‌ని.. విష‌యం లేకుంటే ఎలాంటి హీరో న‌టించినా చూడ‌ర‌ని చ‌ర‌ణ్ అన్నాడు. ఆర్ఆర్ఆర్‌లో త‌న ఇంట్రో సీన్‌కు ప‌డ్డ క‌ష్టం గురించి వివ‌రించాడు. ఆ సీన్ చిత్రీక‌ర‌ణ‌కు 35 రోజులు ప‌ట్టింద‌ని.. చిన్న‌త‌నంలోనే డ‌స్ట్ అల‌ర్జీ కార‌ణంగా స‌ర్జ‌రీ కూడా చేయించుకున్నాన‌ని.. అలాంటి వాడిని విప‌రీత‌మైన దుమ్ము, వేల మంది మ‌నుషుల మ‌ధ్య 35 రోజుల పాటు క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింద‌ని అన్నాడు. ఆ స‌న్నివేశం అద్భుతంగా రావ‌డానికి రాజ‌మౌళే కార‌ణ‌మ‌ని చ‌ర‌ణ్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు.


Tags:    

Similar News