Tollywood : చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కుగా మారిన చిరంజీవి.. నేటితో సమ్మెకు తెరపడనుందా?
మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కయ్యారు. టాలీవుడ్ సమ్మెపై నేడు ఆయన చర్చించనున్నారు
మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కయ్యారు. అగ్ర దర్శకుడు దాసరి నారాయణరావు ఉన్నంత కాలం ఆయన సినీ పెద్దగా వ్యవహరించేవారు. కానీ దాసరి అకాల మరణం తర్వాత ఆ బాధ్యతలను చిరంజీవి తన భుజానకెత్తుకున్నారు. కోవిడ్ సమయంలోనూ చిత్ర పరిశ్రమకు చెందిన కార్మికులను ఆదుకునేందుకు ఆయన ప్రత్యేకంగా ఫండ్ రైజింగ్ చేశారు. కార్మికుల కుటుంబాలాను నాడు ఆదుకున్నారు. అదే సమయంలో చిత్ర పరిశ్రమలో తలెత్తుతున్న అనేక సమస్యలకు చిరంజీవి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాల నిర్మాతల తరుపున ముఖ్యమంత్రిని కలిసే బృందంలోనూ ఆయననే ముందు పెట్టి వెళుతున్నారంటే ఆయనకు పరిశ్రమ ఇస్తున్న గౌరవం అదే అనుకోవాలి.
చిరు ఇంటి వద్దకు...
అలాంటిది గత పథ్నాలుగు రోజుల నుంచి చిత్ర పరిశ్రమలో బంద్ జరుగుతున్నా నిర్మాతల మండలికి, ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ల మధ్య జరుగుతున్న చర్చలు కూడా విఫలమవుతున్నాయి. కార్మికుల డిమాండ్లలో కొన్నింటికి నిర్మాతలు అంగీకరించడంలేదు. షూటింగ్ లలో పాల్గొనేందుకు కార్మికులు అంగీకరించడంలేదు. కార్మిక సంఘాలను విభజించి పాలించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంటి వద్దకు సమ్మె పంచాయతీ చేరింది. ఈరోజు ఇటు నిర్మాతలతోనూ, అటు కార్మిక సంఘాల ప్రతినిధులతోనూ చిరంజీవి విడివిగా సమావేశమవుతున్నారు. చిత్ర పరిశ్రమ ప్రతిష్టను పెంచడంతో పాటు జరిగే నష్టాన్ని నివారించడానికి చిరు నడుంకట్టారనే అనుకోవాలి.
షరతులివీ...
తాజాగా కార్మికుల డిమాండ్లపై ఫిల్మ్ ఫెడరేషన్ కు ఫిల్మ్ ఛాంబర్ లేఖ రాసింది. ఇందులో షరతులు విధిస్తూ తాము అమలు చేసే నిర్ణయాలను కూడా వెల్లడించింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ కాల్ షీట్ ను పన్నెండు గంటల రెగ్యులర్ పనిగంటలుగా పరిగణించాలని పేర్కొంది. రెండో ఆదివారం, కార్మిక శాఖ ప్రకటించిన సెలవు దినాల్లో మాత్రమే రెట్టింపు వేతనం చెల్లించే వీలుందని చెప్పింది. ఫైటర్స్, డ్యాన్సర్స్ కు మాత్రం 2023 సెప్టంబరు నుంచి అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. నైపుణ్యం ఉన్న ఏ వ్యక్తినైనా తన సినిమా కోసం వినియోగించుకునే స్వేచ్ఛను నిర్మాతలకు కల్పించాలని తెలిపింది. అంటూ నాలుగు షరతులు విధించింది.
ఓకే చెబితేనే చర్చలు...
ఈ షరతులకు ఓకే చెబితే రోజుకు రెండు వేలు అంతకంటే తక్కువ సంపాదించే కార్మికుల వేతనాలను వెంటనే పది శాతం, తర్వాత ఏడాది నుంచి ఐదు శాతం, ఆ తర్వాత ఏడాది ఐదు శాతం పెంచుతామని చెప్పింది. అలాగే రోజుకు రెండు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల లోపు సంపాదించేకార్మికులకు వరసగా మూడేళ్ల పాటు ఐదు శాతం వేతనాలను పెంచుతారని పేర్కొంది. తక్కువ బడ్జెట్ చిత్రాలకు మాత్రం వేతనాల పెంపు ఉండబోదని తెలిపింది. ఈ షరతులకు అంగీకరిస్తే చర్చలుంటాయని చెప్పింది. అయితే దీనిపై నేడు చిరంజీవి వద్ద కార్మిక సంఘలు, నిర్మాతలు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది. రేపటి నుంచి షూటింగ్ లు ప్రారంభమయ్యే అవకాశముందని చిత్ర పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.