ఆస్కార్ కాదు కదా.. ఏ అవార్డూ వస్తుందనుకోలేదు : ఎంఎం కీరవాణి

క్లాసికల్ మ్యూజిక్ పరంగా ప్రతిభను కనబర్చడం, అద్భుతం అనదగ్గ సాహిత్యం ఉంటే ఆ పాటకు ఏదైనా అవార్డు..

Update: 2023-03-26 05:20 GMT

బ్లాక్ బస్టర్ సినిమా అయిన ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో.. తెలుగు సినీ ఖ్యాతి విశ్వమంతా తెలిసింది. ఆ ఘనత దర్శకుడు రాజమౌళి, పాట రాసిన చంద్రబోస్, స్వరపరచిన కీరవాణి, పాడిన రాహుల్, కాలభైరవ, కొరియోగ్రఫీ చేసిన ప్రేమరక్షిత్, తమ స్టెప్పులతో అందరినీ ఉర్రూతలూగించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు దక్కుతుంది. బీట్, రిథమ్ ప్రధానంగా సాగే ఈ పాట ఆస్కార్ బరిలో మిగతా పాటలను వెనక్కి నెట్టి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో విజేతగా నిలవడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం. ఈ పాటకు ఆస్కార్ రావడంపై ఎంతమంది సంతోషించారో.. చాలామంది ఆ పాటకు ఆస్కార్ దక్కించుకునేంత స్థాయి ఉందా అన్న చర్చలు కూడా జరిగాయి. తాజాగా ఈ అంశంపై నాటు నాటు పాట సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ పాటకు ఆస్కార్ కాదు కదా.. అసలు ఏ అవార్డు వస్తుందని నేను ఊహించలేదు అని తెలిపారు. నాటు నాటు ఒక కమర్షియల్ సాంగ్ అని ఆయన పేర్కొన్నారు. "ఆర్కెస్ట్రయిజేషన్ లో కొత్తదనం, క్లాసికల్ మ్యూజిక్ పరంగా ప్రతిభను కనబర్చడం, అద్భుతం అనదగ్గ సాహిత్యం ఉంటే ఆ పాటకు ఏదైనా అవార్డు వస్తుందని ఆశిస్తాం. కానీ నాటు నాటు పాట పక్కా ఫాస్ట్ బీట్ సాంగ్. ఈ పాటకు అవార్డు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం వెర్షన్లలోనూ పాటను స్వరపరిచాం. అక్కడి లిరిక్ రైటర్స్ కూడా పాటను బాగానే రాశారు. కానీ.. తెలుగులో ఉన్న నాటు నాటు వీర నాటు.. నాటు నాటు ఊర నాటు వాక్యాలు మంత్రం లాంటివి. ఆ వాక్యాల సృష్టికర్త చంద్రబోస్ ఆస్కార్ పురస్కారానికి అర్హుడే అని భావిస్తాను. రాజమౌళి టేకింగ్, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ ఈ పాటను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి" అని కీరవాణి పేర్కొన్నారు.




Tags:    

Similar News