Chiranjeevi : చిరంజీవి కఠిన నిర్ణయం తీసుకున్నారా? ఇక దూరంగా ఉండనున్నారా?
మెగాస్టార్ చిరంజీవి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఆయన మనస్తాపానికి గురయినట్లు తెలిసింది.
మెగాస్టార్ చిరంజీవి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యలపై ఇకపై ఏ ముఖ్యమంత్రినీ కలవకూడదని నిర్ణయించుకున్నారని సమాచారం. తాను వైఎస్ జగన్ ను సినీ పరిశ్రమ కు సంబంధించిన సమస్యల విషయంలో కలిస్తే దానిని తప్పుదోవపట్టిస్తూ చేస్తున్న వ్యాఖ్యలతో చిరంజీవి మనస్తాపానికి గురయినట్లు చిరంజీవి సన్నిహితులు చెబుతున్నారు. దాసరి నారాయణ రావు మరణించిన తర్వాత తాను టాలీవుడ్ కు పెద్దన్నగా మారాలనుకున్నారు. అయితే తాను మంచికి వెళ్లినా చెడును ఆపాదిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు బాధిస్తున్నట్లు చిరంజీవి సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది. చిత్ర పరిశ్రమల పెద్దలతో తప్ప తాను ప్రభుత్వాల వద్దకు వెళ్లబోనని, రానని కూడా ఆయన చెప్పినట్లు తెలిసింది.
ఇకపై ఏ ముఖ్యమంత్రినీ కలవనంటూ...
గతంలోనూ అందరూ తనను వచ్చి అడిగితేనే తాను జగన్ వద్దకు వెళ్లానని చిరంజీవి నిన్న విదేశాల్లో ఉండి కూడా లేఖ రాశారు. నందమూరి బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కించపర్చేలా ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. చిరంజీవి అభిమానుల సంఘం కూడా బాలకృష్ణ మాటలను ఖండించింది. అయితే చిరంజీవి ఇకపై ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్ లోనూ చిత్ర పరిశ్రమకు సంబంధించి పాలకుల వద్దకు తాను వెళ్లదలచుకోలేదని ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. తనను ఆహ్వానించినా సున్నితంగానే తిరస్కరించాలని చిరంజీవి నిర్ణయించుకున్నారని సినీ పరిశ్రమ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. కానీ చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు, మిగిలిన అసోసియేషన్ లతో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తానని ఆయన అన్నట్లు సమాచారం.
రాజకీయం చేస్తున్నందున...
అయితే తెలంగాణలోనూ ఇటీవల చిత్ర పరిశ్రమలోని కార్మికులు సమ్మెకు దిగడంతో ఆయన సినీ కార్మికులు, నిర్మాతలతోనే మాట్లాడారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో జరిగిన సమావేశానికి కూడా ఆయన దూరంగా ఉన్నారని కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా చిత్ర పరిశ్రమ పెద్దలు కలవాలని భావించి నిర్ణయించి తర్వాత ఆ సమావేశం వాయిదా పడింది. ఇకపై ఏ ముఖ్యమంత్రి వద్దకు తాను వెళ్లాల్సిన అవసరం లేదని, రాజకీయాలను తాను వదిలేశానని, అయినా తనను అందులోకి కావాలని లాగేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని చిరంజీవి అనుమానిస్తున్నారు. సున్నితమనస్కుడైన చిరంజీవి ఇకపై ఏ సీఎంతో భేటీకి చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై కలిసే అవకాశం మాత్రం ఉండదు. అయితే ఆయన వ్యక్తిగతంగా కలసి గెలిచిన తర్వాత అభినందనలు తెలపడంతో పాటు, ఏదైనా తన ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఆహ్వానించడం వంటి వారికే పరిమితం అవుతారని చెబుతున్నారు. మొత్తం మీద బాలయ్య చేసిన వ్యాఖ్యలతో చిరంజీవి మనస్తాపానికి గురయ్యారని చిత్ర పరిశ్రమలోని వర్గాలు తెలిపాయి.