కృష్ణ మరణం పట్ల ప్రముఖుల సంతాపం

సూపర్ స్టార్ కృష్ణ మృతికి ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. సీఎం కేసీఆర్ కృష్ణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

Update: 2022-11-15 02:59 GMT

సూపర్ స్టార్ కృష్ణ మృతికి ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణ మృతి టాలీవుడ్ కే కాకుండా వ్యక్తిగతంగా తనకు తీరని లోటని వ్యాఖ్యానించారు. సుదీర్ఘకాలం చలనచిత్ర రంగంలో ఉన్న కృష్ణకు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారన్నారు.

ఎన్నో హిట్ లు..
ఆయన మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రను చిరస్థాయిగా నిలిపి, తన కెరీర్ లో ఎన్నో హిట్ లను కృష్ణ సాధించారన్నారు. ఆయన కుమారుడు మహేష్ బాబుతో పాటు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని జగన్ వ్యక్తం చేశారు.
దిగ్భ్రాంతికి గురైన మెగాస్టార్...
మెగాస్టార్ చిరంజీవి కృష్ణ మరణం పట్ల దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కోలుకుని తిరిగి వస్తారని ఆశించానని, కానీ అనంతలోకానికి తిరిగి వెళ్లిపోవడం తనను బాధించిందని చిరంజీవి ట్వీట్ చేశారు. సినిమా చరిత్రలో మేరు పర్వతం లాంటి కృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. మాటలకు అందని విషాదమిది అని చిరంజీవి అన్నారు.
చంద్రబాబు సంతాపం....
సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహసానికి మరో పేరు కృష్ణ అని చంద్రబాబు కొనియాడారు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు స్ఫూర్తిని నింపేవని ఆయన అన్నారు. కృష్ణ మరణం పట్ల నారా లోకేష్ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు కృష్ణ మరణం పట్ల తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.



Tags:    

Similar News