వారిద్దరు న‌న్ను మోసం చేశారు

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె వ్యాపారవేత్త భర్త రాజ్ కుంద్రాల‌పై భారీ ఆరోపణలు వచ్చాయి.

Update: 2025-08-14 04:52 GMT

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె వ్యాపారవేత్త భర్త రాజ్ కుంద్రాల‌పై భారీ ఆరోపణలు వచ్చాయి. వారిద్దరూ తనను రూ.60.4 కోట్ల మేర మోసం చేశారని ముంబైకి చెందిన ఓ వ్యాపారి ఆరోపించాడు. ఈ విషయం మూత‌ప‌డిన‌ కంపెనీ బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించినది.

ఈ నేపథ్యంలో శిల్పా, రాజ్‌తోపాటు గుర్తుతెలియని వ్యక్తిపై ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది. వ్యాపార విస్తరణ పేరుతో ఈ మొత్తాన్ని తీసుకున్నారని, అయితే దానిని వ్యక్తిగత ఖర్చుల కోసం వినియోగించారని వ్యాపారవేత్త దీపక్ కొఠారి వాదిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫిర్యాదు గతంలో జుహు పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. అక్కడ మోసం, ఫోర్జరీకి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదైంది. మొత్తం రూ. 10 కోట్లకుపైగా ఉన్నందున.. దాని విచారణ EOWకి అప్పగించబడింది.

దీపక్ కొఠారి జుహు నివాసి. లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్. రాజేష్ ఆర్య అనే వ్యక్తి ద్వారా శిల్పా, రాజ్‌లు దీపక్ కొఠారికి పరిచయం అయ్యారు. ఆ సమయంలో శిల్పా, రాజ్ హోమ్ షాపింగ్, ఆన్‌లైన్ రిటైల్ కంపెనీ అయిన బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌కి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కంపెనీలో ఇద్దరికీ 87.6 శాతం వాటా ఉంది.

అయితే.. శిల్పా, రాజ్‌లు తనను రూ.75 కోట్ల రుణం అడిగారని.. దానికి 12 శాతం వడ్డీ చెల్లిస్తామని హామీ ఇచ్చారని.. తర్వాత ఎక్కువ పన్ను కట్టకుండా రుణాన్ని “పెట్టుబడి”గా తీసుకోవాలని సలహా ఇచ్చార‌ని.. దీనితో పాటు.. ప్రతి నెల లాభాలు, అసలు మొత్తాన్ని తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారని దీపక్ కొఠారి చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే కొఠారీ ఏప్రిల్ 2015లో కంపెనీకి రూ.31.9 కోట్లు, సెప్టెంబర్ 2015లో రూ.28.53 కోట్లు బదిలీ చేశారు. ఈ మొత్తాన్ని షేర్ సబ్‌స్క్రిప్షన్, సప్లిమెంటరీ అగ్రిమెంట్ కింద ఇచ్చారు.

2016 ఏప్రిల్‌లో శిల్పాశెట్టి వ్యక్తిగత హామీ ఇచ్చారని, అయితే సెప్టెంబర్ 2016లో ఆమె డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని కొఠారి పేర్కొన్నారు. 2017లో మ‌రో ఒప్పందంలోని నిబంధనలను పాటించనందున కంపెనీ దివాళా తీసిందని కొఠారీకి తెలిసింది. కొఠారీ తన డబ్బును దుర్వినియోగం చేశారని, ఆ మొత్తాన్ని తమ‌ వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించారని ఆరోపిస్తున్నారు. ప్ర‌స్తుతం EOW ఈ విషయాన్ని లోతుగా పరిశోధిస్తోంది. పోలీసులు ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో మరింత సమాచారం త్వరలో వెల్లడి అయ్యే అవకాశం ఉంది.



Tags:    

Similar News