100 రూపాయలకే 99 చిత్రాల ప్రదర్శన

Update: 2016-10-03 08:28 GMT

ఇప్పటి తరం నటులకు కెరీర్ మొత్తంలో 40 చిత్రాలు చెయ్యటం సాధ్యపడటం లేదు. కానీ రామారావ్, నాగేశ్వర రావ్, శోభన బాబు, క్రిష్ణా, కృష్ణం రాజు, చిరంజీవి, మోహన్ బాబు ఇలా అందరూ వారి నట జీవితం లో 100 పైగా చిత్రాలను అనతి కాలం లోనే దాటినా నటులే. ఈ అరుదైన 100 చిత్రాల జాబితాలో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి తో చేరబోతున్న విషయం విదితమే. నేటి తెలుగు కథానాయకులలో ఈ అరుదైన అర్హత సాధిస్తున్న బాలకృష్ణ అభిమానులు ఈ సంబరాన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కి ఎక్కే స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ తన నట జీవితం మొదలు పెట్టిన తాతమ్మ కల చిత్రం నుంచి డిక్టేటర్ చిత్రం వరకు 99 చిత్రాలను రోజుకి ఒక చిత్రం చొప్పున ప్రొద్దుటూరు లోని అర్చన టాకీస్ లో ప్రదర్శించటానికి ఏర్పాట్లు చేస్తుంది ప్రొద్దుటూరు అభిమాన సంఘం. ఈ 99 చిత్రాల ప్రదర్శన కేవలం 100 రూపాయలకే చేస్తున్నారు. రోజుకి ఒక చిత్రం చొప్పున వారి అభిమాన నటుడి చిత్రాలను ప్రదర్శించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈ అరుదైన ఘనత నమోదు చెయ్యాలని బాలకృష్ణ అభిమాన సంఘం ప్రయత్నిస్తుంది.

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న 100 వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి సంక్రాంతి పండుగ సందర్భముగా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతుంది. విలక్షణ దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Similar News