Israel- gaza-ceasefire : ఇజ్రాయిల్ - గాజా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలుకు అమెరికా సైన్యం

ఇజ్రాయిల్ - గాజా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో అమెరికా రంగంలోకి దిగింది

Update: 2025-10-10 02:13 GMT

ఇజ్రాయిల్ - గాజా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో అమెరికా రంగంలోకి దిగింది. కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా జరిగేందుకు ప్రత్యేకంగా సైనిక బలగాలను పంపింది. గాజా కాల్పుల విరమణ పర్యవేక్షణకు ఈ బృందం పనిచేస్తుంది. అలాగే సహాయ సమన్వయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి అమెరికా ముందుకు వచ్చింది. దాదాపు రెండు వందల మంది సైనికులు ఇజ్రాయిల్ కు చేరుకుని కాల్పుల విరమణ ఒప్పందం పర్యవేక్షణను చేయనున్నారు. ఈ బృందంలో భాగస్వామ్య దేశాలు, ప్రభుత్వేతర సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కూడా ఉంటాయని అమెరికా అధికారులు గురువారం తెలిపారు.

సమన్వయ కేంద్రాన్ని...
అమెరికా అధికారులు తెలిపిన ప్రకారం యుఎస్ సెంట్రల్ కమాండ్‌ ఇజ్రాయెల్‌లో ఒక సివిల్–మిలిటరీ కోఆర్డినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా మానవతా సహాయం, లాజిస్టిక్స్, భద్రతా సహాయం వంటి అంశాలను సమర్థవంతంగా సమన్వయం చేయనున్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత, హమాస్‌ ఆయుధాల తొలగింపు, ఇజ్రాయెల్ సేనల ఉపసంహరణ, గాజా భవిష్యత్ పాలనపై అనేక ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా బృందం పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనుందని అధికారులు పేర్కొన్నారు.
రెండేళ్లుగా జరుగుతున్న...
ఈ బృందంలో రవాణా, ప్రణాళిక, భద్రత, ఇంజినీరింగ్ రంగాల నిపుణులు ఉన్నారు. అయితే అమెరికా సైనికులను గాజా ప్రాంతంలోకి పంపే యోచన లేదని స్పష్టం చేశారు. రెండేళ్లుగా జరుగుతున్న యుద్ధం విషయంలో రెండు ప్రాంతాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తొలిదశ జరగడంతో దానికి తూట్లుపడకుండా ఉండేందుకు అమెరికా ఈ రకమైన చర్యలు ప్రారంభించింది. ఇజ్రాయిల్ లో ఉండి మాత్రమే ఈ బృందం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరగకుండా పర్యవేక్షిస్తుందని అధికారులు తెలిపారు.







Tags:    

Similar News