America : అమెరికాలో భీకర మంచు తుపాన్.. ఇప్పటి వరకూ 30 మంది మృతి

అమెరికాలో భారీ మంచు తుపాను తీవ్రత కొనసాగుతోంది.

Update: 2026-01-27 02:04 GMT

అమెరికాలో భారీ మంచు తుపాను తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున వరకూ అనేక ప్రాంతాల్లో గడ్డకట్టే చలి, మంచు కప్పిన రహదారులు, విద్యుత్‌ అంతరాయాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. తీవ్రమైన చలి ప్రభావిత రాష్ట్రాల్లో ఇప్పటివరకు కనీసం 30 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఆర్కాన్సాస్‌ నుంచి న్యూఇంగ్లాండ్‌ వరకు దాదాపు 1,300 మైళ్ల పరిధిలో ఒక అడుగుకుపైగా మంచు పడింది. దీంతో రహదారి రవాణా స్తంభించింది. వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. అనేక రాష్ట్రాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. పిట్స్‌బర్గ్‌కు ఉత్తరంగా ఉన్న ప్రాంతాల్లో 20 అంగుళాల వరకూ మంచు కురిసినట్లు జాతీయ వాతావరణ సేవ తెలిపింది. అక్కడ గాలివల్ల అనుభూతి చెందే ఉష్ణోగ్రత మైనస్‌ 25 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వరకు పడిపోయింది.

మరోమంచు తుపాను...
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, అమెరికాలోని రెండు వంతుల ప్రాంతాల్లో ఈ తీవ్రమైన చలి త్వరగా తగ్గే సూచనలు లేవు. ఇప్పటికే మంచు, ఐస్‌తో కప్పబడిన ప్రాంతాలకు మరింత ఆర్కిటిక్‌ చలి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. ఈ వారాంతంలో తూర్పు తీర ప్రాంతాల్లో మరో మంచు తుపాను ముప్పు ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి దేశవ్యాప్తంగా 6.3 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్‌ అసౌకర్యం కలిగిందిన పవర్‌ఔటేజ్‌ డాట్‌కామ్‌ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల్లో మంచు వర్షాల కారణంగా చెట్లు, విద్యుత్‌ లైన్లు కూలిపోయాయి. ఉత్తర మిసిసిప్పీ, టెనెస్సీ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మిసిసిప్పీలో 1994 తర్వాత ఇదే అత్యంత ఘోరమైన మంచు తుపాను అని గవర్నర్‌ టేట్‌ రీవ్స్‌ తెలిపారు. అత్యవసర కేంద్రాల్లో మంచాలు, దుప్పట్లు, తాగునీరు, జనరేటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
వేల సంఖ్యలో విమానాలు...
న్యూయార్క్‌ నగరంలో ఒక్క వారాంతంలోనే ఎనిమిది మంది బహిరంగ ప్రదేశాల్లో మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మసాచుసెట్స్‌, ఒహియోలో మంచు తొలగించే వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఆర్కాన్సాస్‌, టెక్సాస్‌లో స్లెడింగ్‌ ప్రమాదాల్లో టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. కాన్సాస్‌లో ఓ బార్‌ నుంచి బయటకు వచ్చిన మహిళ మృతదేహాన్ని మంచులో పోలీసులు గుర్తించారు.సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 12 వేలకుపైగా విమానాలు ఆలస్యం లేదా రద్దయ్యాయి. ఆదివారం 45 శాతం విమానాలు రద్దవడం, కరోనా తర్వాత ఇదే అత్యధికమని విమాన గణాంక సంస్థలు తెలిపాయి. న్యూయార్క్‌ నగరంలో 8 నుంచి 15 అంగుళాల వరకు మంచు కురవడంతో పాఠశాలలు మూతపడ్డాయి. అయితే ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగించాలని విద్యార్థులకు సూచించారు.


Tags:    

Similar News