America : ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికాలో భారీగా నిరసనలు
అమెరికా అంతటా శనివారం నిర్వహించిన “నో కింగ్స్” ర్యాలీల్లో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు
Demonstrators rally in front of the Lincoln Memorial during the No Kings protest in Washington, Saturday,
అమెరికా అంతటా శనివారం నిర్వహించిన “నో కింగ్స్” ర్యాలీల్లో వేలాది మంది ప్రజలు ఇరాన్ యుద్ధం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ముఖ్యంగా మిన్నెసోటా రాష్ట్రం ఈ కార్యక్రమానికి కేంద్రంగా మారింది. అక్కడ వేలాది మంది భుజాలు కలుపుకుని ట్రంప్ కఠిన వలస అమలు చర్యలకు వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చేశారు.సెయింట్ పాల్‌లోని క్యాపిటల్ ప్రాంగణంలో జరిగిన ప్రధాన ర్యాలీలో ప్రముఖ గాయకుడు బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్ పాల్గొన్నారు. అమెరికా కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల పెరుగుదలకు వ్యతిరేకంగా శీతాకాలంలో వీధుల్లోకి వచ్చిన ప్రజలను ఆయన అభినందించారు.
ర్యాలీల్లో వేలాది మంది...
ఫెడరల్ ఏజెంట్ల కాల్పుల్లో మరణించిన రెనీ గుడ్, అలెక్స్ ప్రెట్టి సంఘటనలపై స్పందనగా ఆయన రచించిన “స్ట్రీట్స్ ఆఫ్ మినియాపోలిస్” పాటను అక్కడ ఆలపించారు. ఈ మరణాలు బాధ కలిగించినప్పటికీ, ఐస్‌కు వ్యతిరేకంగా రాష్ట్రం చూపిన ప్రతిస్పందన దేశానికి ఆశ కలిగించిందని అన్నారు. “మీ బలమే ఇది ఇప్పటికీ అమెరికానేనని మాకు గుర్తుచేసింది. నగరాల్లోకి ఇలాంటి దాడులు కొనసాగవు” అని స్ప్రింగ్‌స్టీన్ వ్యాఖ్యానించారు. న్యూయార్క్ సిటీ నుంచి ఐడహో రాష్ట్రంలోని చిన్న పట్టణమైన డ్రిగ్స్ వరకు ప్రజలు ర్యాలీల్లో పాల్గొన్నారు. ఐడహోలో 2024 ఎన్నికల్లో ట్రంప్‌కు 66 శాతం ఓట్లు వచ్చాయి.
శాంతియుతంగా సాగిన భారీ నిరసనలు...
జూన్‌లో జరిగిన తొలి రెండు విడతల ర్యాలీలకు 50 లక్షలకుపైగా, అక్టోబర్‌లో 70 లక్షల మంది పాల్గొన్నారని నిర్వాహకులు అంచనా వేశారు. శనివారం 90 లక్షల మంది పాల్గొంటారని భావించినా, ఆ సంఖ్యపై స్పష్టత లేదు. మొత్తం 50 రాష్ట్రాల్లో 3,100కుపైగా కార్యక్రమాలు నమోదు అయ్యాయని తెలిపారు. చాలా చోట్ల నిరసనలు శాంతియుతంగా సాగినా, కొన్నిచోట్ల అరెస్టులు జరిగాయి. లాస్ ఏంజెల్స్‌లో ఫెడరల్ నిర్బంధ కేంద్రం సమీపంలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాలి స్వచ్ఛం చేయడానికి ఓ వ్యక్తి ఆకుల ఊదే యంత్రం ఉపయోగించాడు. డెన్వర్‌లో కొందరు నిరసనకారులు రహదారి అడ్డుకోవడంతో పోలీసులు ‘అనధికార సమీకరణం’గా ప్రకటించి పొగ కేనిస్టర్లు వదిలారు. వాటిని కొందరు తిరిగి పోలీసుల వైపు విసిరినట్లు తెలిపారు. కనీసం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
నిరసనలపై రిపబ్లికన్ నేతలు ఏమన్నారంటే?
వైట్ హౌస్ ప్రతినిధి అబిగైల్ జాక్సన్ ఈ ర్యాలీలు “వామపక్ష నిధుల మద్దతుతో నడిచేవి” అని పేర్కొన్నారు. “వీటిని పట్టించుకునేది కవరేజ్ చేసే రిపోర్టర్లే” అని ఆమె వ్యాఖ్యానించారు. నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి మౌరీన్ ఓ’టూల్ కూడా తీవ్రంగా స్పందించారు. “ఇవి అమెరికా వ్యతిరేక భావజాలానికి వేదికలు” అన్నారు.మిన్నెసోటా ర్యాలీలో వలస విధానాలతో పాటు ఇరాన్ యుద్ధం, ట్రాన్స్‌జెండర్ హక్కుల తగ్గింపుపై కూడా వక్తలు మాట్లాడారు. బిలియనీర్ల ఆర్థిక ప్రభావంపై విమర్శలు వినిపించాయి.వాషింగ్టన్‌లో లింకన్ మెమోరియల్ నుంచి నేషనల్ మాల్ వరకు ప్రజలు నినాదాలతో ర్యాలీ చేశారు. “కిరీటం పెట్టుకోకు” వంటి ప్లకార్డులు కనిపించాయి. సాన్ డియాగోలో సుమారు 40 వేల మంది ర్యాలీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. న్యూయార్క్‌లో సివిల్ లిబర్టీస్ యూనియన్ డైరెక్టర్ డోన్నా లీబర్‌మాన్ మాట్లాడుతూ, ప్రజలు నిరసన చేయకుండా భయపెట్టాలనేది ట్రంప్ మద్దతుదారుల ఉద్దేశమని అన్నారు.
విదేశాల్లోనూ ర్యాలీలు...
ఈ కార్యక్రమాలను ముందుండి నడిపిన ఇండివిజిబుల్ సంస్థ సహనిర్వాహకుడు ఎజ్రా లెవిన్ ప్రకారం, డజన్ల కొద్దీ దేశాల్లో కూడా నిరసనలు జరిగాయి. రోమ్‌లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. లండన్, పారిస్ నగరాల్లో కూడా అమెరికన్లు, మానవ హక్కుల సంస్థలు కలిసి ర్యాలీలు నిర్వహించారు.