Haiti : వీధుల్లో మృతదేహాలు.. ఇళ్లకు నిప్పంటించిన గ్యాంగ్
కరీబియన్ దేశం హైతీ పట్టణంలో రక్తపాతం సృష్టించారు
కరీబియన్ దేశం హైతీ లోని మధ్యభాగ పట్టణం పెటిట్-రివియర్ డి ఎల్'ఆర్టిబోనైట్ లోఆదివారం తెల్లవారుజామున తీవ్ర హింస చెలరేగింది. శక్తివంతమైన గ్యాంగ్ ఒక విజిలెంట్ బృందంపై దాడి చేయడంతో ప్రాంతం రక్తపాతానికి వేదికైంది. ఈ విషయాన్ని ప్రాంతీయ అధికారులు అసోసియేటెడ్ ప్రెస్ కు వెల్లడించారు.‘గ్రాన్ గ్రిఫ్’గా పిలిచే గ్యాంగ్ జీన్ డెనిస్ పరిసరాల్లో దారుణంగా హింస సృష్టించింది. వీధులపై రక్తంతో తడిసిన మృతదేహాలు కనిపించాయి. పలు ఇళ్లకు నిప్పంటించారు. స్థానికులు భయంతో తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎంతమంది మరణించారన్నది వెంటనే స్పష్టత రాలేదు. అయితే 2021లో అప్పటి అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ హత్య తర్వాత ఐదేళ్లుగా గ్యాంగ్‌ల మధ్య హింస కొనసాగుతున్న నేపథ్యంలో ఇది తాజా ఘోర ఘటనగా మారింది.
విజిలెంటీల ప్రవేశంతో...
2023 ప్రాంతంలో గ్యాంగ్‌లకు ప్రతిఘటించేందుకు స్థానికులు విజిలెంటీ బృందాలు ఏర్పరచడం ప్రారంభించారు. గ్యాంగ్‌ల దౌర్జన్యాలతో విసిగిపోయిన ప్రజలు స్వయంగా ఎదురుదాడులు చేపట్టారు. అయితే ఈ ప్రతీకార చర్యలు దేశంలో శాంతి స్థాపన ప్రయత్నాలను మరింత క్లిష్టం చేశాయి. విజిలెంటీలు అనుమానిత గ్యాంగ్ సభ్యులను పట్టుకుని రాళ్లతో కొట్టడం, అవయవాలు నరికి వేయడం, తల నరికి దహనం చేయడం వంటి దారుణాలకు పాల్పడుతున్నట్టు సమాచారం.
గ్రాన్ గ్రిఫ్ దౌర్జన్యం...
‘గ్రాన్ గ్రిఫ్’ గ్యాంగ్ ఆర్టిబోనైట్ ప్రాంతంలో నిరంతరం భయాందోళనలు సృష్టిస్తోంది. గత ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వమే ఈ గ్యాంగ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది.ఐక్యరాజ్యసమితి ప్రకారం ఈ ప్రాంతంలో జరిగే పౌర మరణాల్లో 80 శాతం ఈ గ్యాంగ్ కారణమని పేర్కొంది. పౌరులపై హత్యలు, అత్యాచారాలు, బాలికలపై దాడులు, వేల మందిని ఇళ్ల నుంచి తరిమివేయడం, మానవ అవయవాలు నరికి వేయడం వంటి అమానుషాలకు ఈ గ్యాంగ్ పాల్పడిందని వెల్లడించింది.