అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఇరాన్‌పై మరింత కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఒప్పందానికి గడువు సమీపిస్తుండగా, ఇరాన్‌లోని అన్ని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను లక్ష్యంగా తీసుకుంటామని తెలిపారు. టెహ్రాన్ 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించి, యుద్ధానికి శాశ్వత ముగింపు కావాలని ప్రకటించింది. “మొత్తం దేశాన్ని ఒక్క రాత్రిలో నేలమట్టం చేయగలం. ఆ రాత్రి రేపే కావచ్చు” అని ట్రంప్ అన్నారు. మంగళవారం రాత్రి 8 గంటల గడువు తుదిగా ఉంటుందని, ఇప్పటికే చాలాసార్లు గడువు పెంచినట్టు చెప్పారు.ప్రపంచ రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని అన్ని నౌకాయానానికి తెరవాలని అమెరికా ఇరాన్‌కు తెలిపింది. లేదంటే విద్యుత్ కేంద్రాలు, వంతెనలు ధ్వంసమవుతాయని హెచ్చరించింది. దీనిపై యుద్ధ నేరాల ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇక ఇజ్రాయిల్ కూడా ఒత్తిడి పెంచింది. ఒక ప్రధాన పెట్రోరసాయన కర్మాగారంపై దాడి చేసి, విప్లవ గార్డు గూఢచారి విభాగాధిపతిని హతమార్చింది.
పది పాయింట్లతో...
ఇరాన్ తన పది పాయింట్ల ప్రతిపాదనను పాకిస్తాన్ ద్వారా పంపినట్టు ప్రభుత్వ వార్తా సంస్థ IRNA వెల్లడించింది. కైరోలోని ఇరాన్ రాయబార కార్యాలయ అధిపతి మొజ్తబా ఫెర్దౌసీ పూర్ అసోసియేటెడ్ ప్రెస్‌కు మాట్లాడుతూ, “మళ్లీ మమ్మల్ని దాడి చేయబోమని హామీలు ఉంటేనే యుద్ధం ముగింపునకు అంగీకరిస్తాం” అన్నారు. గత చర్చల సమయంలో అమెరికా రెండుసార్లు బాంబుదాడులు చేయడంతో ట్రంప్ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయామని చెప్పారు. మధ్యవర్తిత్వ చర్చల్లో పాల్గొన్న ఒక ప్రాంతీయ అధికారి, “ఇద్దరితోనూ ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి” అని గోప్యత నిబంధనతో వెల్లడించారు. ట్రంప్ కూడా చర్చలు కొనసాగుతున్నట్టు అంగీకరించారు.‘స్వేచ్ఛ కోసం ఇరానీయులు కష్టాలు భరిస్తారు’ అని ట్రంప్ అన్నారు.
రేపు అర్ధరాత్రికి నేలమట్టం...
“రేపు అర్ధరాత్రి కల్లా ఇరాన్‌లోని ప్రతి వంతెన నేలమట్టం అవుతుంది. అన్ని విద్యుత్ కేంద్రాలు అగ్నికి ఆహుతవుతాయి” అని ట్రంప్ స్పష్టంగా చెప్పారు. యుద్ధ నేరాల ఆరోపణలపై ప్రశ్నించగా “నాకు ఎలాంటి ఆందోళన లేదు” అన్నారు. ఈ దాడులు ప్రస్తుత ఇరాన్ నాయకత్వానికి ముగింపు తెచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.అయితే బాంబుదాడుల నుంచి ప్రజలు తలదాచుకుంటున్నప్పటికీ, దేశంలో తిరుగుబాటు లక్షణాలు కనిపించడం లేదు.ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టీఫన్ దుజారిక్ మాట్లాడుతూ, పౌర మౌలిక వసతులపై దాడి చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని హెచ్చరించారు.ఈజిప్టు, పాకిస్తాన్, టర్కీ మధ్యవర్తులుగా కలిసి కాల్పుల విరమణ, హార్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ప్రతిపాదనలు పంపినట్టు మధ్యప్రాచ్య అధికారుల సమాచారం. మరోవైపు ఒమాన్ అధికారులతో కలిసి జలసంధి నిర్వహణపై కూడా చర్చలు సాగుతున్నాయి.
ఇజ్రాయెల్ దాడులు… గ్యాస్ క్షేత్రం లక్ష్యం...
దక్షిణ పార్స్ గ్యాస్ క్షేత్రం లోని కీలక పెట్రోరసాయన కర్మాగారంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇది ఇరాన్‌కు ప్రధాన ఆదాయ వనరు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రం ఇదే. కతార్‌తో భాగస్వామ్యంగా ఉంది.ఇరాన్ విప్లవ గార్డు గూఢచారి విభాగాధిపతి మజీద్ ఖాదెమీని కూడా హతమార్చినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. అలాగే కుద్స్ దళానికి చెందిన అస్ఘర్ బకేరీని కూడా చంపినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ, “ఇరాన్ అగ్రనేతలను ఒక్కొక్కరిని వెతికి చంపుతాం” అన్నారు.ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ అరుదుగా ప్రకటన జారీ చేసి ఖాదెమీ మృతిపై సంతాపం తెలిపారు.ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని బహ్రామ్, మెహ్రాబాద్, అజ్మాయేశ్ విమానాశ్రయాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసినట్టు తెలిపింది. పలువురు హెలికాప్టర్లు, యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది.టెహ్రాన్ నివాసి ఒకరు “ఎప్పుడూ బాంబుల శబ్దాలే వినిపిస్తున్నాయి” అని చెప్పారు. మరొకరు రాత్రిళ్లు నిద్ర మాత్రలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
దాడుల్లో 29 మంది మృతి...
టెహ్రాన్‌లోని అజాదీ స్క్వేర్ సమీపంలో గల షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంపై దాడి జరిగింది. ఈ విశ్వవిద్యాలయం సైన్యానికి సాంకేతిక సహకారం అందిస్తున్నదని అనేక దేశాలు ఆంక్షలు విధించాయి.దేశవ్యాప్తంగా జరిగిన దాడుల్లో కనీసం 29 మంది మృతి చెందినట్టు అధికారిక సమాచారం. లెబనాన్‌లో కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఐన్ సాదెహ్ ప్రాంతంలోని అపార్టుమెంట్‌పై దాడిలో ముగ్గురు మృతి చెందారు. యుద్ధం ప్రారంభమైన ప్పటి నుంచి ఇరాన్‌లో 1,900 మందికి పైగా, లెబనాన్‌లో 1,400 మందికి పైగా మరణించారు. లక్షలాది మంది నిర్వాసితు లయ్యారు. ఇజ్రాయెల్ సైనికులు 11 మంది మృతి చెందారు. గల్ఫ్ అరబ్ దేశాలు, వెస్ట్ బ్యాంక్, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో కూడా మరణాలు నమోదయ్యాయి. అమెరికా సైనికుల్లో 13 మంది మృతి చెందినట్టు సమాచారం.