ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ఆరోవారంలోకి ప్రవేశించింది. అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సర్వోన్నత నేత అయతొల్లా అలీ ఖామెనీ ఇచ్చిన హెచ్చరికలు ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. టర్కీ సరిహద్దు దాటి శనివారం ఇరాన్‌లోకి ప్రవేశించిన అసోసియేటెడ్ ప్రెస్ ప్రతినిధులు రాజధాని టెహ్రాన్ దిశగా 12 గంటల ప్రయాణం చేశారు. మార్గమధ్యంలో యుద్ధం ఆనవాళ్లు కనిపించినా, అనేక ప్రాంతాల్లో సాధారణ జీవనం కొనసాగుతున్న దృశ్యాలు వారు గమనించారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖామెనీ మృతి చెందిన ఐదు వారాలు గడిచినా యుద్ధం తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చి అదనపు బృందాన్ని దేశంలోకి అనుమతించింది. ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న సంస్థకు చెందిన మీడియా సహాయకుడు ఈ బృందంతో ఉన్నాడు. అయినప్పటికీ, వార్తా కంటెంట్‌పై పూర్తి సంపాదకీయ నియంత్రణ APదేనని తెలిపింది.
దెబ్బతిన్న హుస్సేనియా...
సరిహద్దు నుంచి సుమారు ఆరు గంటల దూరంలో ఉన్న వాయువ్య నగరం జంజాన్ వద్ద యుద్ధ ధ్వంసం స్పష్టంగా కనిపించింది. అధికారుల ప్రకారం, ‘హుస్సేనియా’గా పిలిచే షియా మత సముదాయ కేంద్రంపై వైమానిక దాడి జరిగింది. ఇద్దరు మృతి చెందారు. అక్కడ ఉన్న క్లినిక్, గ్రంథాలయం ధ్వంసమయ్యాయి. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ సముదాయంలోని బంగారు గుంబజ్ సహా అనేక భాగాలు దెబ్బతిన్నాయి. ఈ దాడిపై ప్రశ్నించగా, “సైనిక ప్రధాన కార్యాలయం లక్ష్యంగా చేసుకున్నాం. పౌర సదుపాయాలు దెబ్బతినకుండా చూసుకుంటాం” అని ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది.“ఈ దాడి నాకు తీవ్ర బాధ కలిగించింది. అమెరికా, ఇజ్రాయెల్ తమ దురుద్దేశాన్ని ప్రపంచానికి చూపిస్తున్నాయి” అని స్థానికురాలు సోమయే షోజాయీ తెలిపారు. ప్రాంతీయ సాంస్కృతిక, ఇస్లామిక్ మార్గదర్శక విభాగ డైరెక్టర్ జాఫర్ మొహమ్మది మాట్లాడుతూ, “గ్రంథాలయ సంరక్షకుడు, రెడ్ క్రెసెంట్ వాలంటీర్ మృతి చెందారు. ఇక్కడ పేదలకు ఉచిత వైద్యం అందించేవారు. 35 వేలకుపైగా పుస్తకాలు ఉన్న గ్రంథాలయం ఇది” అన్నారు. ఎందుకు ఈ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారో తెలియదన్నారు. “శాంతి కోసం ట్రంప్‌తో చర్చలు జరపాలని ఇరాన్ భావించింది. కానీ ట్రంప్ యుద్ధంతో స్పందించారు. యుద్ధం ప్రారంభించింది ఆయనే. విజయం మాత్రం మాదే” అని వ్యాఖ్యానించారు.
భయం ఉన్నా తగ్గని రద్దీ...
అమెరికా, ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా వేలాది దాడులు జరిపాయి. “ఇరాన్‌ను రాతి యుగానికి వెనక్కి నెట్టేస్తాం” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని గడువు విధించారు.ఇరాన్ నాయకత్వం మాత్రం అమెరికా ప్రతిపాదనలను తిరస్కరిస్తూ తమ వైఖరిని కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ దాడులు తగ్గే సూచనలు లేవు. ఇరాన్ ప్రజలు తమ నాయకత్వాన్ని కూల్చాలని పిలుపునిస్తోంది.అయితే ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య నగరాల్లో జీవనం యథావిధిగా కొనసాగుతోంది. రహదారులపై రాకపోకలు సాధారణంగా ఉన్నాయి. దుకాణాలు తెరిచే ఉన్నాయి. రెస్టారెంట్లలో మేకమాంసం వంటలు, బియ్యం, బార్లీ సూప్, కుంకుమపువ్వు పానీయాలు వడ్డిస్తున్నారు. లౌడ్‌స్పీకర్లలో సంగీతం వినిపిస్తోంది.ఇటీవలి కాలంలో తల కప్పుకునే నిబంధనలు సడలడంతో, అనేక మహిళలు తలదుస్తులు లేకుండా బయటకు వస్తున్నారు.టెహ్రాన్ చేరుకునే మార్గంలో రెండు చెక్‌పోస్టులు దాటినా AP బృందాన్ని ఎక్కడా ఆపలేదు.
టెహ్రాన్‌లో నిశ్శబ్దం...
రాత్రి పన్నెండు దాటిన తర్వాత టెహ్రాన్ నగరం నిశ్శబ్దంగా కనిపించింది. రాత్రి రాజధాని పర్వతాలపై భారీ వైమానిక దాడులు జరిగాయి.సైన్యం, అంతర్గత భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతున్నాయి. ఇరాన్ అధికారులు ఇప్పటివరకు 1,900 మందికి పైగా మృతి చెందినట్లు తెలిపారు. అందులో ఎంతమంది సైనికులు, పౌరులన్నది స్పష్టత లేదు. ప్రభుత్వ భవనాలు, పోలీస్ స్టేషన్లు ధ్వంసమైన దృశ్యాలు AP ప్రతినిధులు చూశారు. సాధారణ దుస్తుల్లో ఉన్న బసీజ్ దళాలు, యూనిఫామ్‌లో ఉన్న రివల్యూషనరీ గార్డ్ దళాలు చెక్‌పోస్టులు నిర్వహిస్తున్నాయి. ఒకచోట కారును ఆపి ప్రెస్ కార్డులు చూపించాలని అడిగారు. ఇంధనంపై భారీ సబ్సిడీ ఉంది. నాలుగు లీటర్ల పెట్రోలు ధర సుమారు 15 అమెరికా సెంట్లు. అయితే ఒకేసారి 20 లీటర్లకే పరిమితం చేస్తున్నారు. పెట్రోలు బంకుల వద్ద క్యూలు కనిపించలేదు.జంజాన్‌లో విశ్రాంత సైనికుడు మహ్మూద్ మాసూమీ మాట్లాడుతూ, “అమెరికాతో విభేదాలు 1953లో సీఐఏ మద్దతుతో జరిగిన తిరుగుబాటు నుంచి ఉన్నాయి. మేమెప్పుడూ తలొగ్గం. మా నాయకులు దేశాన్ని రక్షిస్తారని నమ్మకం” అన్నారు.