ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించిన తర్వాత చమురు ధరలు తగ్గాయి. హెర్ముజ్ జలసంధి మళ్లీ తెరవడం సహా అంశాలపై ఇస్లామాబాద్‌లో శుక్రవారం నుంచి అమెరికాతో చర్చలు జరపనున్నట్లు టెహ్రాన్ తెలిపింది. మొదట ఇరాన్ సూచించిన 10 అంశాల ప్రణాళిక అమలు సాధ్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే తర్వాత అదే ప్రణాళిక మోసపూరితమని వ్యాఖ్యానించారు. ఒప్పందానికి ముందు గంటల్లో ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. “ఒప్పందం కుదరకపోతే ఈ రాత్రే ఒక నాగరికత అంతమవుతుంది” అని హెచ్చరించారు. హెర్ముజ్ జలసంధి తెరవడాన్ని ఒప్పందంలో చేర్చాలని కూడా అన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, ఇరాన్‌పై దాడులను రెండు వారాలు నిలిపివేయాలన్న ట్రంప్ నిర్ణయానికి మద్దతు ప్రకటించింది. అయితే లెబనాన్‌లో హిజ్బుల్లాతో సాగుతున్న యుద్ధానికి ఈ కాల్పుల విరమణ వర్తించదని స్పష్టం చేసింది.
బీరూట్‌పై వైమానిక దాడులు...
బుధవారం ఉదయం హెచ్చరికలు లేకుండానే బీరూట్ నగర మధ్య ప్రాంతాల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగాయి. నగరమంతా పెద్ద శబ్దాలు వినిపించగా, అనేక చోట్ల పొగలు ఎగసిపడ్డాయి. వాణిజ్య ప్రాంతాలపై కూడా దాడులు జరిగినట్లు లెబనాన్ ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. ప్రాణనష్టం వివరాలు వెంటనే తెలియలేదు.గత ఏడాది సంయుక్త అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో నేలమట్టం కింద పూడ్చిన సమృద్ధ యురేనియాన్ని బయటకు తీసి తొలగించేందుకు అమెరికా ఇరాన్‌తో కలిసి పనిచేస్తుందని ట్రంప్ తెలిపారు. “ఇక యురేనియం శుద్ధీకరణ ఉండదు” అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో ఇరాన్ నుంచి ఎలాంటి ధృవీకరణ రాలేదు.
ఇంధన ధరలపై జర్మనీ హెచ్చరిక
కాల్పుల విరమణతో వెంటనే ఇంధన ధరలు తగ్గవని జర్మనీ ప్రభుత్వం తెలిపింది. హెర్ముజ్ జలసంధి మూసివేత గ్లోబల్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిందని, పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందని పేర్కొంది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ మాట్లాడి కాల్పుల విరమణకు సంతృప్తి వ్యక్తం చేశారు. శాశ్వత శాంతి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ తెలిపారు.రష్యా క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కూడా సైనిక ఉద్రిక్తత తగ్గడాన్ని స్వాగతించారు.పోప్ లియో XIV ఈ పరిణామాన్ని ఆశాకిరణంగా పేర్కొన్నారు.
లెబనాన్‌లో అనిశ్చితి..
లెబనాన్ కూడా ఈ ఒప్పందంలో భాగమేనని మధ్యవర్తి దేశాలు చెబుతున్నప్పటికీ, నెతన్యాహూ మాత్రం అంగీకరించడం లేదు. దీంతో అక్కడి ప్రజల్లో అయోమయం నెలకొంది. హిజ్బుల్లా కూడా మధ్యవర్తులకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది.యుద్ధ సమయంలో తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఆరోపణలతో అబుదాబిలో 375 మందిని అదుపులోకి తీసుకున్నట్లు యుఏఈ పోలీసులు తెలిపారు.
పాకిస్థాన్ ధృవీకరణ...
శుక్రవారం ఇస్లామాబాద్‌లో జరగనున్న చర్చలకు ఇరాన్ హాజరవుతుందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, భారత్, చైనా, ఒమన్, సౌదీ అరేబియా తదితర దేశాలు కాల్పుల విరమణను స్వాగతించాయి. హెర్ముజ్ జలసంధి నిర్బంధం లేకుండా తెరవాలని పిలుపునిచ్చాయి.ఒప్పందం తరువాత అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పడిపోయాయి. ఆసియా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి.