మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ ప్రయత్నాలకు ఊతమిచ్చే పరిణామంగా, లెబనాన్‌తో నేరుగా చర్చలు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గురువారం వెల్లడించారు. ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న హెజ్‌బొల్లా మిలిటెంట్లను నిరాయుధీకరించడం, పొరుగు దేశాలతో సంబంధాలు నెలకొల్పడమే లక్ష్యమని చెప్పారు.ఇజ్రాయెల్ ఏర్పాటైన 1948 నుంచి లెబనాన్‌తో సాంకేతికంగా యుద్ధస్థితి కొనసాగుతోందని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం లెబనాన్‌తో ఎలాంటి కాల్పుల విరమణ ఒప్పందం లేదని స్పష్టం చేశారు. ఉత్తర ఇజ్రాయెల్ భద్రత పునరుద్ధరించేవరకు హెజ్‌బొల్లాపై దాడులు కొనసాగిస్తామని వీడియో సందేశంలో తెలిపారు.
వచ్చే వారం చర్చలు...?
లెబనాన్ నుంచి తక్షణ స్పందన రాలేదు. అయితే వచ్చే వారం యుఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ వద్ద ఇజ్రాయెల్–లెబనాన్ చర్చలు ప్రారంభం కావచ్చని అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ యుద్ధం ప్రభావంతో ఇప్పటికే నడుస్తున్న కాల్పుల విరమణపై ఈ చర్చల అవకాశాలు కొంత బలం చేకూర్చినట్లు కనిపించింది. బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడులు, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు, చర్చల్లో ఏకాభిప్రాయం సాధ్యమా అన్న అనిశ్చితి పరిస్థితిని క్లిష్టంగా మార్చాయి. అయితే గురువారం తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రభావంపై సందేహం వ్యక్తం చేశారు. “హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా జరగనివ్వడంలో ఇరాన్ చాలా చెడు పని చేస్తోంది. అది మన ఒప్పందం కాదు” అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.
డ్రోన్ దాడులు జరుగుతున్నాయని...
ఇదే సమయంలో కువైట్ తనపై డ్రోన్ దాడులు జరిగాయని ఇరాన్, దాని అనుబంధ గుంపులపై ఆరోపించింది. సౌదీ అరేబియా కీలక పైప్‌లైన్‌కు నష్టం కలిగిందని తెలిపింది. అయితే ఇరాన్ రివల్యూషనరీ గార్డు దాడుల ఆరోపణలను ఖండించింది.ఇజ్రాయెల్ బీరూట్‌పై భారీ వైమానిక దాడులు జరిపిన మరుసటి రోజే ఈ చర్చల ప్రకటన వచ్చింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత లెబనాన్‌లో ఇదే అత్యంత ప్రాణనష్టం కలిగిన రోజు అని నివేదికలు తెలిపాయి. వాషింగ్టన్‌లో జరగబోయే చర్చలను అమెరికా తరఫున లెబనాన్ రాయబారి మిషెల్ ఇస్సా, ఇజ్రాయెల్ తరఫున అమెరికాలోని రాయబారి యెచియెల్ లైటర్ నిర్వహించనున్నట్లు సమాచారం. లెబనాన్ తరఫున ఎవరు పాల్గొంటారో స్పష్టత లేదు.
కాల్పుల విరమణపై ....
కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా అమెరికా–ఇరాన్ మధ్య పరస్పర ఒత్తిడి కనిపించింది. హార్ముజ్ జలసంధిలో మైన్లు అమర్చినట్లు ఇరాన్ వార్తా సంస్థలు సూచించాయి. ఒప్పందం పాటించకపోతే ఇరాన్‌పై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు.జలసంధి నుంచి ప్రయాణించే నౌకల కదలికలపై పర్యవేక్షణ పెరిగింది. యుద్ధం మొదలైన తర్వాత బ్రెంట్ క్రూడ్ చమురు ధరలు 35 శాతం పెరిగి 98 డాలర్ల వద్దకు చేరాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఆహార ధరలపై ప్రభావం చూపుతోంది. ఇరాన్ అణు కార్యక్రమం, సమృద్ధ యురేనియం నిల్వలపై కూడా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ అంశం కాల్పుల విరమణ చర్చల్లో కీలకంగా మారింది. లెబనాన్‌లో హెజ్‌బొల్లాపై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రకటించగా, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఖలీబాఫ్ తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకారం బుధవారం జరిగిన దాడుల్లో 300 మందికి పైగా మృతి చెందగా, 1,100 మందికి పైగా గాయపడ్డారు.