Israel - Iran War : కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు.. కొనసాగుతున్నదాడులు

ఇజ్రాయెల్ లెబనాన్‌లో దాడులు ప్రారంభించడంతో ప్రతిస్పందనగా ఇరాన్ మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది

Update: 2026-04-09 01:51 GMT

Government supporters chant slogans after the announcement of a two-week ceasefire with the United States and Israel in Tehran, Iran,

ఇజ్రాయెల్ లెబనాన్‌లో దాడులు ప్రారంభించడంతో ప్రతిస్పందనగా ఇరాన్ మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో యుద్ధాన్ని నిలిపే కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం అమలు కాలేదు. జలసంధిని వెంటనే తెరవాలని వైట్ హౌస్ డిమాండ్ చేసింది. శాంతి చర్చలు కొనసాగాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఒప్పందం కుదిరిన తర్వాత అమెరికా, ఇరాన్ రెండూ తామే గెలిచామని ప్రకటించాయి. ప్రపంచ నాయకులు ఉపశమనం వ్యక్తం చేశారు. అయితే అదే సమయంలో ఇరాన్, గల్ఫ్ అరబ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులు మళ్లీ దాడి చేశాయి. మరోవైపు లెబనాన్‌లో హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు పెంచింది. బీరుట్‌లో వాణిజ్య, నివాస ప్రాంతాలపై బాంబులు వర్షం కురిపించింది. ఒక్క రోజులోనే అక్కడ 182 మంది ప్రాణాలు కోల్పోయారు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ ఒప్పందాన్ని “సున్నితమైనది”గా అభివర్ణించారు. తాజా హింస ఆ ఒప్పందాన్ని పూర్తిగా దెబ్బతీయవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

నిబంధనలు ఉల్లంఘించిందని ...
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ అమెరికా తమ 10 నిబంధనల్లో మూడు ఉల్లంఘించిందన్నారు. అందువల్ల చర్చలు కొనసాగించడం “అసంబద్ధం”గా ఉందని చెప్పారు. హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు, కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఇరాన్ గగనతలంలో డ్రోన్ చొరబాటు, తుది ఒప్పందంలో ఇరాన్ యురేనియం సమృద్ధిని అంగీకరించకపోవడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి లెబనాన్ యుద్ధం ముగియడం కూడా ఒప్పందంలో భాగమేనన్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని చెప్పారు. మధ్యవర్తిత్వం చేసిన పాకిస్తాన్ ప్రధాని మాత్రం “లెబనాన్ సహా అన్ని ప్రాంతాలకు ఇది వర్తిస్తుంది” అని పేర్కొన్నారు. లెబనాన్ ఆరోగ్యశాఖ ప్రకారం బుధవారం ఇజ్రాయెల్ దాడుల్లో 182 మంది మృతి చెందారు. ఇది ఇజ్రాయెల్–హిజ్బుల్లా యుద్ధంలో ఒకే రోజులో అత్యధిక మరణాలు.
హోర్ముజ్ జలసంధి మూసివేత...
“లెబనాన్‌లో జరుగుతున్న హత్యాకాండను ప్రపంచం చూస్తోంది. ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సింది అమెరికానే” అని అరఘ్చి ఎక్స్‌లో పోస్టు చేశారు.వైట్ హౌస్ ప్రతినిధి కరోలైన్ లీవిట్ హోర్ముజ్ జలసంధి మూసివేతను “అసహనీయమైన చర్య”గా అభివర్ణించారు. వెంటనే తెరవాలని ట్రంప్ ఆశాభావం, డిమాండ్ పునరుద్ఘాటించారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఘన విజయం సాధించాయని చెప్పారు. ఇకపై ఇరాన్ సైన్యం ప్రాంతానికి పెద్ద ముప్పు కాదన్నారు. దీనికి ప్రతిగా ఇరాన్ సైన్యం అమెరికా, ఇజ్రాయెల్ తమ షరతులను అంగీకరించాయని ప్రకటించింది.
ఒప్పందంపై భిన్నాభిప్రాయాలు...
ఒప్పందం నిబంధనలపై రెండు దేశాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి రుసుము వసూలు చేసే పద్ధతిని చట్టబద్ధం చేస్తుందని ఇరాన్ తెలిపింది. అయితే నౌకల రాకపోకలకు టోల్ వసూలు చేయడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారని వైట్ హౌస్ పేర్కొంది. మారిటైమ్ ఇంటెలిజెన్స్ సంస్థ విండ్వర్డ్ ప్రకారం బుధవారం కేవలం 11 నౌకలే జలసంధి గుండా ప్రయాణించాయి. ఒక్కో బ్యారెల్ చమురుకు ఒక డాలర్ వరకూ ఇరాన్ రుసుము వసూలు చేస్తోంది. అతిపెద్ద ట్యాంకర్లు 30 లక్షల బ్యారెల్స్ చమురు మోసుకెళ్తాయి. ఇరాన్ క్షిపణి, అణు కార్యక్రమాల భవితవ్యం కూడా స్పష్టంగా తెలియలేదు. భూగర్భంలో ఉన్న సమృద్ధి యురేనియాన్ని బయటకు తీసివేయడంలో అమెరికా సహకరిస్తుందని ట్రంప్ చెప్పారు. దీనిపై ఇరాన్ స్పందించలేదు.
శాంతి చర్చల దిశగా ...
శాంతి చర్చలకు అమెరికా బృందానికి జేడీ వాన్స్ నేతృత్వం వహించనున్నారు. పాకిస్తాన్‌లో శుక్రవారం నుంచే చర్చలు మొదలయ్యే అవకాశం ఉందని వైట్ హౌస్ తెలిపింది.యుద్ధం ముగిసేందుకు అమెరికా సైన్యాన్ని ప్రాంతం నుంచి ఉపసంహరించాలి, ఆంక్షలు ఎత్తివేయాలి, నిల్వ ఉంచిన తమ నిధులను విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది.ఇజ్రాయెల్ సైన్యాధ్యక్షుడు ఎయాల్ జమీర్ హిజ్బుల్లాపై దాడులు కొనసాగుతాయని ప్రకటించారు. బుధవారం 10 నిమిషాల్లోనే లెబనాన్ అంతటా 100కుపైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు తెలిపారు.అరబ్ లీగ్ ప్రధాన కార్యదర్శి అహ్మద్ అబౌల్ ఘైట్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ కావాలనే దెబ్బతీస్తోందని ఆరోపించారు.హిజ్బుల్లా ఈ ఒప్పందాన్ని పాటిస్తామా లేదా అనేది స్పష్టంగా చెప్పలేదు. అయితే మధ్యవర్తులకు అవకాశం ఇస్తామని తెలిపింది. ఇజ్రాయెల్ కాల్పులు ఆపితే తామూ ఆపుతామని ఒక అధికారి వెల్లడించారు.
జలసంధిలో రుసుములు…
ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య చమురు, వాయువు రవాణాలో 20 శాతం ఈ జలసంధి గుండా సాగుతుంది. ఇరాన్ బెదిరింపులతో అనేక వాణిజ్య నౌకలు మార్గం మార్చుకున్నాయి. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది.ఈ రుసుముల పద్ధతి అమలైతే జలసంధిని అంతర్జాతీయ మార్గంగా చూసే పద్ధతికి మార్పు వస్తుంది. గల్ఫ్ అరబ్ దేశాలకు ఇది ఆమోదయోగ్యం కాకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు ఇరాన్ క్షిపణుల హెచ్చరికలు జారీ చేశాయి. కొంతసేపు నిశ్శబ్దం నెలకొన్నా మళ్లీ దాడులు చోటుచేసుకున్నాయి. ఇరాన్ లవాన్ దీవిలోని చమురు శుద్ధి కేంద్రం దాడికి గురైంది. అనంతరం యూఏఈ గగన రక్షణ వ్యవస్థ ఇరాన్ క్షిపణులను అడ్డుకుంది.ఇరాన్‌లో మార్చి చివరి వరకు 1,900 మందికి పైగా మరణించినట్లు సమాచారం. లెబనాన్‌లో 1,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నివాసాలు విడిచిపెట్టారు. ఇజ్రాయెల్ సైనికులు 12 మంది మృతి చెందారు.ఇజ్రాయెల్‌లో 23 మంది, గల్ఫ్ దేశాలు, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో మరికొందరు, అమెరికా సైనికులు 13 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి.


Tags:    

Similar News