హాస్టల్ లో అగ్నిప్రమాదం.. 19 మంది విద్యార్థులు సజీవదహనం
గయానా రాజధాని జార్జ్ టౌన్ కు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహి దియా నగరంలో సెకండరీ పాఠశాల హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ లో..
fire accident in south america
దేశంలో, ఇతర దేశాల్లోనూ తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా కొందరి జీవితాలు అగ్ని కీలలకు బలైతే.. మరికొందరు తీవ్రగాయాలతో నరకం చూస్తున్నారు. తాజాగా అమెరికాలోని ఓ హాస్టల్ లో అగ్నిప్రమాదం జరుగగా.. 19 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ అమెరికాలోని గయానా దేశంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
గయానా రాజధాని జార్జ్ టౌన్ కు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహి దియా నగరంలో సెకండరీ పాఠశాల హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ లో మంగళవారం ఉదయం మంటలు చెలరేగాయి. అవి క్షణాల వ్యవధిలో హాస్టల్ భవనం చుట్టూ భారీ ఎత్తున ఎగసి పడ్డాయి. చూస్తుండగానే అగ్నికీలలతో, దట్టమైన పొగలతో ఆ ప్రాంతం నిండిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా 12-18 ఏళ్ల లోపు వారేనని అధికారులు తెలిపారు.
స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఇతర అధికారులు.. మంటలు ఆర్పి సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న కొందరు పిల్లల్ని రక్షించి, తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.