Pakistan : పాకిస్తాన్ లో మరోసారి పేలుళ్లు..లాహోర్ విమానశ్రయం వద్ద పేలుడు
పాకిస్తాన్ లోని లాహోర్ విమానాశ్రయం వద్ద బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది
పాకిస్తాన్ కు కేవలం భారత్ నుంచి మాత్రమే కాదు స్వదేశంలో బలూచిస్తాన్ నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలు తొమ్మిదింటిపై జరిపిన దాడి ఘటన మరవక ముందే మరొకసారి లాహోర్ విమానాశ్రయం వద్ద బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. లాహోర్ లోని వాల్టన్ విమానాశ్రయంతో పాటుగా గోపాల్ నగర్, నసీరాబాద్ లో వరసపేలుళ్లు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనలో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో ఎవరికీ కాసేపు అర్థం కాలేదు.
విమానాశ్రయాన్ని మూసివేయడంతో...
విమానాశ్రయాన్ని ఇప్పటికే పాక్ మూసివేసింది. అయితే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మరోసారి భారత్ దాడికి దిగిందేమోనని భావించారు. కానీ ఈ దాడి ఎవరు చేశారన్న దానిపై స్పష్టత రాకపోయినప్పటికీ బలూచిస్తాన్ వాదుల నుంచి ఈ పేలుళ్లు సంభవించి ఉంటాయన్న అంచనాలు వేస్తున్నారు. దాదాపు ఐదు అడుగుల నుంచి ఆరు అడుగల పొడవు ఉన్న డ్రోన్లతో బాంబులు పేల్చడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ దాడి ఎవరు చేశారన్నది మాత్రం ఇంకా అధికారికంగా ఎవరూ ప్రకటించడం లేదు.
ఎవరూ మరణించలేదని చెబుతున్నా...
కానీ ఈ దాడిలో పాక్ కు చెందిన కొందరు సైనికులు మరణించినట్లు తెలిసింది. అయితే లాహోర్ పోలీసులు మాత్రం ఈ దాడులతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెబుతున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా లాహోర్ విమానాశ్రయాన్ని మూసివేశామని, అందుకే ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఈ దాడి ఎవరు చేశారన్న దానిపై పాక్ ఇంటలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. సంఘటన స్థలికి బాంబు స్క్కాడ్ లు చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.