Bangladesh : భారతీయులకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో భారీ ర్యాలీ

బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి

Update: 2026-01-07 01:46 GMT

బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారతీయులకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతూనే ఉంది. హత్యకు గురైన విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్యకు న్యాయం చేయాలంటూ ఆయన పార్టీ మంగళవారం ఢాకాలో రోజంతా ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న భారతీయుల పని అనుమతులను రద్దు చేయాలన్న డిమాండ్‌ కూడా ముందుకు తెచ్చింది.నాలుగు అంశాల డిమాండ్‌లో భాగంగా హాది హత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న నిందితులను భారత్‌ నుంచి తిరిగి పంపించాలని ఇన్‌కిలాబ్ మోంచో కోరింది. భారత్ ఇందుకు అంగీకరించకపోతే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఢాకా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని హెచ్చరించినట్టు ‘ది ఢాకా ట్రిబ్యూన్‌’ తెలిపింది.

సరిహద్దు దాటారన్న ఆరోపణలపై...
హాది హంతకులు భారత్‌లోకి ప్రవేశించారన్న ఆరోపణలను భారత అధికారులు ఇప్పటికే ఖండించారు. అక్రమంగా సరిహద్దు దాటినట్టు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.‘మార్చ్ ఫర్ జస్టిస్’ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీ ఉదయం షాబాగ్‌ నుంచి ప్రారంభమైంది. పది పికప్‌ వాహనాలు, కాలినడకన కార్యకర్తలు సైన్స్ ల్యాబ్‌, మొహమ్మద్‌పూర్‌, మిర్‌పూర్–10, ఉత్తరా, బాషుందరా, బడ్డా, రాంపురా, జత్రాబరి వంటి కీలక ప్రాంతాలుగా ప్రయాణించి సాయంత్రానికి మళ్లీ షాబాగ్‌కు చేరుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు. హాది హత్య దర్యాప్తులో పురోగతి లేదన్న అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడమే ఈ నిరసన లక్ష్యమని పాల్గొన్నవారు చెప్పారు. హంతకులు, కుట్రకారులు, సహాయకులు, వారికి ఆశ్రయం ఇచ్చినవారందరిపై కేసులు నమోదు చేసి ఫిబ్రవరి 12 పార్లమెంటు ఎన్నికలకు ముందే విచారణ పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు.
అరెస్ట్ చేయాలంటూ....
ర్యాలీలో “హాది రక్తాన్ని వృథా కానివ్వం”, “హంతకుడు స్వేచ్ఛగా ఎందుకు తిరుగుతున్నాడు?”, “ఇన్‌కిలాబ్‌ జెండా ఎరుపు–పచ్చ” వంటి నినాదాలు వినిపించాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్‌లో ఉన్నట్టు ఆరోపిస్తున్న “ఫాసిస్టు సహాయకులను” గుర్తించి అరెస్టు చేయాలని కూడా నిరసనకారులు డిమాండ్‌ చేసినట్టు నివేదిక పేర్కొంది.32 ఏళ్ల హాది జూలై–ఆగస్టు 2024లో జరిగిన భారీ నిరసనల సమయంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆ ఉద్యమాలే షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వ పతనానికి దారి తీసాయి. ఫిబ్రవరి 12 ఎన్నికల్లో పోటీ చేస్తున్న హాది డిసెంబరు 12న ఢాకాలో ఎన్నికల ప్రచారం సమయంలో తలపై కాల్పుల్లో గాయపడ్డారు. చికిత్స కోసం సింగపూర్‌కు తరలించగా డిసెంబరు 18న మృతి చెందారు.
భారత్–బంగ్లాదేశ్ సంబంధాలపై ప్రభావం...
హాది హత్యతో బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. కొన్ని వర్గాలు భారత సంబంధం ఉందని ఆరోపించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ ఆరోపణలను భారత్‌ తోసిపుచ్చింది. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తాము పూర్తిగా ఖండిస్తున్నామని, అక్కడి పరిస్థితులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సింది బంగ్లాదేశ్ ప్రభుత్వ బాధ్యత అని, మరో కోణంలో చూపించే ప్రయత్నం సరికాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ గత నెల న్యూఢిల్లీలో చెప్పారు. బంగ్లాదేశ్ ప్రజలతో సంబంధాలను బలపర్చడానికే భారత్‌ కట్టుబడి ఉందని, అక్కడ శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నట్టు తెలిపారు. మొత్తం మీద ఢాకాలో ఇంకా భారత్ కు వ్యతిరేకంగా ప్రదర్శనలు.. నిరసనలు జరుగుతుండటం ఉద్రిక్తతలకు దారి తీసింది.


Tags:    

Similar News