Hyderabad : పెళ్లిళ్ల సీజన్ పై ఎల్.పి.జి ఎఫెక్ట్.. ఆల్టర్నేటివ్ చూస్తున్న హోటల్స్ యజమానులు

దేశవ్యాప్తంగా వంటగ్యాస్‌ కొరత వెంటాడుతోంది.

Update: 2026-03-11 12:18 GMT

దేశవ్యాప్తంగా వంటగ్యాస్‌ కొరత వెంటాడుతోంది. ముఖ్యంగా కమర్షియల్‌ సిలిండర్ల సరఫరా తగ్గడంతో హోటళ్లు, రెస్టారంట్లు మూతపడుతున్నాయి. గ్యాస్ కొరత ఇప్పుడు ప్రధానంగా వివాహాలు, శుభకార్యాలపై కూడా పడుతుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. వివాహాలకు విందు భోజనాలు అతిధులకు వడ్డించడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. వివాహానికి వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించిన అనంతరం భోజనాలు చేసి వెళ్లడం కూడా భారతీయ సంస్కృతిలో భాగమే.అయితే ఇప్పుడు ఎల్.పి.జి కొరతతో హోటల్స్ నిర్వాహకులు కూడా విపరీతంగా ఒక్కొక్క ప్లేట్ ధరను పెంచారు. అయితే తాము ఎంచుకున్న పదార్ధాలను మాత్రమే వండి వడ్డిస్తామని హోటల్స్ నిర్వాహకులు చెబుతున్నారు.

వేలమంది అతిధులకు...
వివాహమైనా, శుభకార్యమైనా కనీసం వెయ్యి మందికి పైగా అతిధులు వస్తారు. గతంలో అయితే ప్లేట్ కు ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకూ వెజిటేరియన్ భోజనం ఉండేది. కానీ నేడు దానిని మరింతగా పెంచారు. ఒక్కొక్క ప్లేట్ ధర పదిహేను వందల రూపాయలకు పెంచినట్లు తెలిసింది. మరొకవైపు గ్యాస్ కొరతతో కట్టెలు, బొగ్గులతో వంటలు చేయించి వడ్డించేందుకు కొన్ని హోటల్స్ సిద్ధమవుతున్నాయి. దీంతో పాత సంప్రదాయం ప్రకారం, కట్టెలు, బొగ్గులకు గిరాకీ పెరిగింది. హోటల్స్ లో గతంలో పొట్టు పొయ్యిలు వినియోగించేవారు. గ్యాస్ వినియోగంతో పని సులువయిన తర్వాత పొట్టు పొయ్యిలు కూడా కనుమరుగయ్యాయి. ఫంక్షన్ హాలులో కూడా వంటల విషయం తమకు సంబంధంలేదని, పాత్రలు, నీటి సరఫరా మాత్రమే చేస్తామని షరతులు పెడుతున్నారు.
కట్టెలు.. బొగ్గులతో...
అయితే ఇప్పుడు హోటల్స్ లో కొందరు యజమానులు కట్టలు, బొగ్గులతో అమ్మమ్మల నాటి వంటకాలు సిద్ధమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. బొగ్గు, కట్టెల కోసం క్యూ కడుతున్నారు. హైదరాబాద్ కు ఇతర ప్రాంతాల నుంచి బొగ్గులను, కట్టెలను లారీలను తెప్పించి కొందరు స్టాక్ చేసి పెట్టుకుంటున్నారు. దీంతో గ్యాస్ సమస్య నుంచి తాత్కాలికంగా సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలా వండి వార్చిన వంటలకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని కస్టమర్లు చెబుతున్నారు. అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ హోటల్స్ మూతపడకుండా పెళ్లిళ్లు, శుభకార్యాలకు మాత్రమే కాకుండా రోజు వారీ హోటల్స్ ను కూడా కట్టెలు, బొగ్గుల వినియోగం హైదరాబాద్ నగరంలో పెరిగిందని హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. గ్యాస్ కొరతతో దాదాపుగా మూతబడే పరిస్థితికి హోటల్స్ చేరుకోవడంతో పురాతన ప్రత్యామ్నాయ పద్ధతులను ఎంచుకుంటున్నారు.


Tags:    

Similar News