Hyderabad : నీటి ట్యాంకర్ల కోసం నగరవాసుల కష్టాలు
హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చాలా చోట్ల ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నారు.
హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చాలా చోట్ల ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నారు. మార్చి నెలలోనే ట్యాంకర్ల వాడకం పెరిగిందని చెబుతున్నారు. గతంలో మే నెల నుంచి జూన్ మాసాల్లో ఎక్కువగా ట్యాంకర్లను తెప్పించుకునే వారు. కానీ ఈసారి మార్చి నెల నుంచి ఎండల తీవ్రత పెరగడంతో పాటు భూ గర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్లలో చాలా చోట్ల ఇప్పటికే ఎండిపోయాయి. ముఖ్యంగా అపార్ట్ మెంట్లలో నివసించే వారు ఖచ్చితంగా రోజుకు రెండు నుంచి మూడు వాటర్ ట్యాంకర్ల నీటిని తెప్పించుకుంటున్నారు. ఒక్కొక్క వాటర్ ట్యాంకర్ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకూ పలుకుతుండటంతో ఆర్థికంగా భారం పడుతుందని ఆవేదన చెందుతున్నారు.
కాంక్రీట్ జంగిల్ గా మారి...
హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగిల్ గా మారిపోవడంతో ఎక్కువగా అపార్ట్ మెంట్లు వెలిశాయి. ఇక కొండ ప్రాంతాల్లో నీటి ట్యాంకర్లు నిరంతరాయంగా తెప్పించుకుంటుంటారు. అక్కడ భూ గర్భ నీరు లభంచదు. ఇక మిగిలిన ప్రాంతాల్లోనూ రోజు వారీ వాడకం కోసం నీటి కోసం ట్యాంకర్లను తెప్పించుకోవాల్సి వస్తుందని అపార్ట్ మెంట్ వాసులు చెబుతున్నారు. బోర్లు ఎండిపోవడంతో ఈసారి మార్చి నుంచి మొదలయిందని, ప్రస్తుతం ప్రయివేటు ట్యాంకర్ల నుంచి నీటిని తెప్పించుకుంటున్నామని చెబుతున్నారు. కొందరు వాటర్ బోర్డు ద్వారా తెప్పించుకుంటున్నారు. అది ఆలస్యం అవుతుండటంతో కొంత డబ్బులు ఎక్కువ పెట్టయినా ట్యాంకర్లను నగర ప్రజలు ఆశ్రయించాల్సి వస్తుంది. నిర్మాణ రంగం యాక్టివిటీ కూడ ాపెరగడంతో భూగర్భ జలాలు త్వరగా అడుగంటిపోయాయని నిపుణులు చెబుతున్నారు.
నగరం మధ్యలోనే కాకుండా...
కేవలం నగరం మధ్యలో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కాదు.. ఈ సారి శివారు ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు కొంత అడుగంటిపోయాయి. గత ఏడాది వానలు సమృద్ధిగా కురిసినప్పటికీ నిన్న మొన్నటి వరకూ కొంత బోర్ల నుంచి నీరు బాగానే వచ్చేదని, గత పది రోజుల నుంచి ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో భూగర్భ జలాలు అందక బోర్లు కూడా మరమ్మతులకు గురవుతున్నాయని అంటున్నారు. నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఇక వాణిజ్య అవసరాల కోసం కూడా నీటిని ట్యాంకర్ల ద్వారా తెప్పించుకుంటుండటంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పాతబస్తీ, మొహదీపట్నం, మణికొండ, నాగోలు, ఎల్.బి.నగర్ ప్రాంతాల్లోనూ నీటి కోసం జనం చాలా చోట్ల ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. వాటర్ బోర్డు అందించే నీరు మంచినీటికి వాడుకుంటూ.. రోజు వారీ వాడకం కోసం ఈ ట్యాంకర్లను అదనంగా తెప్పించుకుంటున్నామని వారు చెబుతున్నారు.