Hyderabad : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇక భూముల ధరలకు రెక్కలే

హైదరాబాద్ లో భూముల ధరలు పెరగనున్నాయి. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా ధరలు పెరిగే అవకాశముంది

Update: 2025-02-14 05:56 GMT

హైదరాబాద్ లో భూముల ధరలు పెరగనున్నాయి. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా ధరలు పెరుగుతాయని రియల్ వ్యాపారులు చెబుతున్నారు. అవుటర్ రింగ్ రోడ్డు లోపల ప్రాంతాన్ని మొత్తాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమయింది. మరింత మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కూడా అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా డ్రోన్ స్వేను కోర్ అర్బన్ ఏరియా అంతటా నిర్వహించాలని రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు సిద్ధమయ్యారు. దీంతో అవుటర్ రింగ్ రోడ్డు లోపల, పక్కనే ఉన్న భూముల ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏడు ఫ్లై ఓవర్లను నిర్మించాలని...
దీంతో పాటు హైదరాబాద్ నగరంలో కొత్తగా మరో ఏడు ఫ్లైఓవర్లు నిర్మించాలన్న ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ట్రాఫిక్ సమస్యలను మరింతగా తొలగించేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని, సత్వరం పనులు చేపట్టి వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వీలుగా హైదరాబాద్ నగరంలో గృహాలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు.
ట్రాఫిక్ నియంత్రణకు...
గ్రేటర్ హైదరాబాద్ం పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకుని వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రేవంత్ రెడ్డి కోరారు. కోర్ అర్బన్ ప్రాంతంలో చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమైన మరో ఏడు కూడళ్లలో ఫ్లై ఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా భూసేకరణ, ఇతర పనులను పూర్తి చేసి, వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సిద్ధమవ్వడంతో భూముల ధరలు మరింతగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు.


Tags:    

Similar News