నకిలీ విద్యుత్ బిల్లు మెసేజ్‌తో మోసం.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఖాతా నుంచి ₹9.10 లక్షలు గల్లంతు

వాట్సాప్ మెసేజ్‌తో మొదలైన సైబర్ మోసం ఏపీకే ఫైల్ ఇన్‌స్టాల్ చేయించి ఖాతాలపై పట్టు

Update: 2026-02-01 12:58 GMT

హైదరాబాద్: నాగోల్‌కు చెందిన ఓ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ని సైబర్ నేరగాళ్లు నకిలీ విద్యుత్ బిల్లు పేరుతో మోసం చేశారు. ఈ ఘటనలో అతడి బ్యాంక్ ఖాతాల నుంచి మొత్తం ₹9.10 లక్షలు మాయమైనట్లు పోలీసులు తెలిపారు.

కోంకిమల్ల హనుమంతరావు (72) రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. జనవరి 29, 2026న అతడికి గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అందులో హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి మరో మొబైల్ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

మెసేజ్ నిజమేనని నమ్మిన హనుమంతరావు ఆ నంబర్‌కు ఫోన్ చేశారు. ఆ తర్వాత వేర్వేరు నంబర్ల నుంచి వాట్సాప్ ఆడియో, వీడియో కాల్స్ వచ్చాయి. కాల్ చేసిన వ్యక్తి ‘ఈ-ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్’ అధికారినని చెప్పాడు. ఐఫోన్‌లో ఉన్న సిమ్‌ను ఆండ్రాయిడ్ ఫోన్‌లో పెట్టాలని సూచించాడు.

ఏపీకే ఫైల్‌తో ఖాతాలపై దాడి

తర్వాత మొబైల్ స్క్రీన్ షేర్ చేయించి ‘Electric bill Update last month(decan).apk’ అనే ఏపీకే ఫైల్ ఇన్‌స్టాల్ చేయించారు. సర్వీస్ ఛార్జీగా ₹12 చెల్లించాలని చెప్పారు.

అది చేసిన కొద్ది సేపటికే ఓటీపీ మెసేజ్‌లు, డెబిట్ అలర్ట్‌లు వరుసగా వచ్చాయి. ఖాతాలు చెక్ చేయగా అనుమతి లేకుండా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. మొత్తం ₹9,10,000 నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మోసానికి ఉపయోగించిన మొబైల్ నంబర్లపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల హెచ్చరిక

విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా నిలిపివేత అంటూ వచ్చే మెసేజ్‌లు, కాల్స్‌కు స్పందించొద్దని పోలీసులు సూచించారు. గుర్తు తెలియని వారు పంపే ఏపీకే ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయకూడదని, స్క్రీన్ షేర్ చేయడం, ఓటీపీలు చెప్పడం ప్రమాదకరమని హెచ్చరించారు.

Tags:    

Similar News