Hyderabad : రెడీ టు బిల్డ్.. హైదరాబాద్ లో సొంత ఇల్లు కావాలనుకునే వారికి గుడ్ న్యూస్

హైదరాబాద్ లో సొంతిల్లు కల సాకారం చేసుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2026-02-06 04:44 GMT

హైదరాబాద్ లో సొంతిల్లు కల సాకారం చేసుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరలో ఇళ్ల స్థలాలను ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించడానికి సిద్ధమవుతుంది. హైదరాబాద్ నగరంలో సొంతిల్లు అంటే ఒక కల. అందులో అన్ని సౌకర్యాలు ఉండే ప్రాంతంలో తక్కువ ధరకు స్థలాలు కావాలనుకున్న వారికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తీపి కబురు అందించింది. చదరపు గజం కేవలం ఇరవై వేల రూపాయలకు మాత్రమే వేలం ద్వారా విక్రయించేందుకు సిద్ధమవుతుంది. అయితే ఇందుకోసం వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. వేలంలో స్థలం పొందిన వారికి ఎలాంటి వివాదాలు లేని స్థలం మీ సొంతమవుతుంది.

అన్ని మౌలిక సదుపాయాలు...
తెలంగాణ ప్రభుత్వం కొన్ని లే అవుట్లలో ఖాళీ ఉన్న ఇంటి స్థలాలను వేలం వేయాలని నిర్ణయించింది. సర్కారు వేలం వేసే స్థలాలు కావడంతో పాటు ఇప్పటికే ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలన్నీ ఉండటంతో వెంటనే ఇంటి నిర్మాణాన్ని చేపట్టవచ్చు. సొంత ఇంటిని తమకు ఇష్టమొచ్చిన రీతిలో నిర్మించుకునే వీలుంది. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఇందుకోసం ఖాళీగా ఉన్న ప్లాట్లను గుర్తించి అందులో గుర్తింపు పొందిన లే అవుట్లలో ఉన్న ఖాళీగా ఉన్న ప్లాట్లను వేలం ద్వారా విక్రయించినున్నట్లు అధికారులు తెలిపారు.
మొత్తం 137 ఖాళీలు...
హైదరాబాద్ నగరం పరిధిలో మొత్తం 137 ప్లాట్లు ఖాళీగా ఉన్నట్లు గుర్తించి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ వీటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించనుంది. ఈ స్థలాలు రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. అవుటర్ రింగ్ రోడ్డు, ఆదిభట్ల ఐటీ కారిడార్ కు సమీపంలో 105 ప్టాల్లున్నాయి. ఈ పాట్లు ఒక్కొక్కటి రెండు వందల గజాల నుంచి ఐదు వందల గజాల విస్తీర్ణం కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో కనీస చదరపు గజం ధర 25 వేల రూపాయలుగా నిర్ణయించింది. బహదూర్ పల్లిలో పన్నెండు ప్లాట్లున్నాయి. ఇక్కడ రెండు వందల నుంచి వెయ్యి చదరపు గజాల ప్లాట్లు న్నాయి. ఇక్కడ ప్లాట్ గజం ధర 27 వేలుగా నిర్ణయించారు. కార్నర్ ప్లాటయితే ముప్ఫయివేలు.
వేలంలో పాల్గొనాలంటే...
కుర్మల్ గూడలో మరో ఇరవై ప్లాట్లు వేలానికి రెడీగా ఉన్నాయి. ఇక్కడ చదరపు గజం ఇరవై వేల రూపాయాల నుంచి ప్రారంభమవుతుంది. అయితే ప్లాట్లను సొంతం చేసుకోవాలంటే ముందుగా బహిరంగ వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఫిబ్రవరి ఏడో తేదీ, ఎనిమిదో తేదీన వేలం నిర్వహిస్తారు. అయితే బహిరంగ వేలంలో పాల్గొనాలంటే ముందుగా మీ సేవా కేంద్రాల్లో పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ముందుగా డిపాజిట్ ను డీడీ రూపంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కు చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు www.swagruha.telangana.gov.in ను చూసి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే అవకాశముంటుందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News