Telangana : అత్యవసర సేవలకు ఆటంకం కలిగించొద్దండీ.. ఆందోళనతో బంకులకు రాకండి

ప్రజలు ఎవరూ ఆందోళన చెందకుండా సంయమనం పాటించాలని హైదరాబాద్ పెట్రోలు డీలర్స్ అసోసియేషన్ కోరింది

Update: 2026-03-25 12:25 GMT

ప్రజలు ఎవరూ ఆందోళన చెందకుండా సంయమనం పాటించాలని హైదరాబాద్ పెట్రోలు డీలర్స్ అసోసియేషన్ కోరింది. ఆందోళనకు గురయి ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ ట్యాంక్ ఫుల్ చేయించుకునే ప్రయత్నం చేస్తే మిగిలిన వారు, అవసరం ఉన్న వారు, అత్యవసర సేవలకు ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆసుపత్రులకు రోగులను తరలించే అంబులెన్స్ లకు కూడా పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడుతుందని, తద్వారా ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. ఆయిల్ కంపెనీలు కూడా పదే పదే ప్రకటన చేస్తున్నా పెట్రోలు కొరత ఉందన్న ప్రచారంతో క్యూ కడుతున్నారు.

ఎలాంటి కొరత లేదని...
హైదరాబాద్ లో పెట్రోలు, గ్యాస్ కు ఎలాంటి కొరత లేదని ఆయిల్ కంపెనీలు ప్రకటిస్తూనేఉన్నాయి. గతంలో క్రెడిట్ ప్రాతిపదికన ఆయిల్ ట్యాంకర్లను పెట్రోలు బంకులకు హెచ్.పి.సి.ఎల్, బీపీసీఎల్, ఐవోఎల్ లు పంపేవి. కానీ ఇప్పుడు యుద్ధం ప్రకటనతో క్యాష్ అండ్ క్యారీతో మాత్రమే పెట్రోలు ట్యాంకర్లను పంపుతున్నారని పెట్రోలు బంకుల యజమానులు చెబుతున్నారు. దీనివల్లనే ప్రతి రోజూ ఒక ట్యాంకరు బంకుకు వచ్చేదని, క్యాష్ అండ్ క్యారీ నిబంధన పెట్టడంతోనే కొంత సమస్య ఏర్పడిందని, అయినా హైదరాబాద్ తో పాటు తెలంగాణలోనూ పెట్రోలు నిల్వల కొరత లేదని చెబుతున్నారు.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదని...
ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదని, ఒక్కసారిగా పెట్రోలు, డీజిల్ కోసం క్యూ కడితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించాయి. డబ్బాల్లో, క్యాన్లలో పెట్రోలు నిల్వ ఉంచుకోవద్దని పెట్రోలు డీలర్స్ అసోసియేషన్ చెప్పింది. అది ప్రమాదకరమని, నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. పెట్రోలు బంకులు మూత పడటానికి ప్రధాన కారణం ఒక్కసారిగా జనం వచ్చి పెట్రోలు కోసం క్యూ కట్టడం వల్లనేనని అంటున్నారు. సాధారణ రోజుల నాలుగు నుంచి ఐదు రెట్లు పెట్రోలు, డీజిల్ కోసం ప్రజలు బంకుల వద్ద క్యూ కడుతున్నారని, సరఫరా వ్యవస్థ సాధారణంగానే కొనసాగుతుందని తెలిపారు. అత్యవసర సేవలకు ఆటంకం కలిగించవద్దని వేడుకుంటున్నారు.


Tags:    

Similar News